ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కి వేధింపులు.. ప్రయాణికుడు అరెస్టు

బెంగుళూరు నుండి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Last Updated : Oct 19, 2018, 02:29 PM IST
ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కి వేధింపులు.. ప్రయాణికుడు అరెస్టు

బెంగుళూరు నుండి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకి చెందిన రాజు గంగప్ప అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ.. అదే విమానంలో సేవలందిస్తున్న ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించగా ఆమె ప్రశ్నించింది. అయితే ఆ యువకుడు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆమెను దూషించడం ప్రారంభించాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ తన సమస్యను పై అధికారులకు విన్నవించింది. వెంటనే ఇండిగో అధికారులు స్పందించి.. సదరు ప్రయాణికుడిని ముంబయిలోని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించమని తెలిపారు.

విమానం ముంబయి ఎయిర్ పోర్టు చేరగానే.. సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఎయిర్ పోర్టు పోలీసులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. సదరు ప్రయాణికుడిపై ఐపీసీ సెక్షన్ 354 క్రింద కేసును నమోదు చేశామని వారు తెలిపారు. బుధవారం నాడు ఆ యువకుడిని ముంబయి కోర్టులో ప్రవేశపెట్టారు. తర్వాత కోర్టు ఆదేశం మేరకు ఒక రోజు  రిమాండ్‌లో ఉంచారు. మరల గురువారం తనను కోర్టులో ప్రవేశబెట్టారు.

ప్రస్తుతం ఈ కేసు విషయంలో అదనపు దర్యాప్తు చేయవలసి ఉందని ముంబయి పోలీసులు తెలిపారు. ఆ దర్యాప్తును బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని.. దానిని బట్టి తాము కోర్టుకి రిపోర్టును అందిస్తామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ విమానంలో జరిగిన సంఘటన గురించి ఇండిగో అధికారులు ఏ విధంగానూ స్పందించలేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు విమానాల్లో జరిగాయి. ఇటీవలే ఓ ప్రయాణికుడు తన సాటి ప్రయాణికురాలి సీటుపై మద్యం తాగిన మత్తులో మూత్ర విసర్జన చేయగా.. తనపై కూడా  కేసును నమోదు చేయడం జరిగింది.

Trending News