యూపీ, బీహార్ రాష్ట్రాల్లో రోడ్లు నెత్తురోడాయి. తెల్లవారుజామునే విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం జరగడంతో 8 మంది వలస కూలీలు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలో అర్ధరాత్రి వలస కూలీలపై బస్సు దూసుకెళ్లింది. ముజఫర్ నగర్ - షరాన్ పూర్ రాష్ట్ర రహదారిపై వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నారు. రాత్రి చీకటిగా ఉండడంతో ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు.. వలస కూలీలపై దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా పంజాబ్ నుంచి బీహార్‌కు వెళ్తున్నారు. పంజాబ్‌లో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. ఐతే బీహార్ గోపాల్ గంజ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇంతలోనే ప్రమాదం జరగడంతో అనంతలోకాలకు తరలిపోయారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బీహార్‌లో బస్సు, ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. సమస్తిపూర్ శంకర్ చౌక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది వలస కూలీలు ఉన్నారు. చాలా మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..