అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవచ్చని.. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణ పనులను ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం భూమి చదును పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఓ విశేషం వెలుగు చూసింది.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం భూమి చదును చేస్తున్న క్రమంలో తవ్వకాల్లో కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. దేవుళ్లకు సంబంధించిన కళాఖండాలు, శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. రామజన్మభూమిలో పురాతన కళాఖండాలు బయటపడ్డట్లు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఐతే పది రోజులుగా జరుగుతున్న భూమి చదును కార్యక్రమాల సందర్భంగా ఈ శిథిలాలు బయటపడ్డాయని ప్రచారం జరుగుతోంది. శాండ్ స్టోన్( ఇసుకరాయి) మీద చెక్కిన కళాఖండాలు బయటపడ్డాయని అక్కడ పని చేసే కార్మికులు చెబుతున్నారు. వాటిలో పెద్ద పెద్ద స్తంభాలు కూడా ఉన్నాయంటున్నారు. కుబేర్ తీలా వద్ద ఓ శివలింగం కూడా బయటపడినట్లు తెలుస్తోంది.
రామజన్మభూమిలో రామజన్మభూమి తీర్థ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 10 రోజుల క్రితం నుంచి భూమి చదును కార్యక్రమాలు చేస్తున్నారు. రామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రామజన్మభూమిలో ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని మానస్ భవన్ కు తరలించారు. రామజన్మభూమిలో రామ మందిరం పూర్తయిన తర్వాత తిరిగి ప్రతిష్ఠించనున్నారు.
.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..