భారత దేశంలో పెళ్లి సంస్కృతి చాలా గొప్పది. భారతీయ వివాహ సంస్కృతిపై విదేశాలు సైతం మక్కువ చూపుతున్నపరిస్థితి ఉంది. ఐతే మన దేశంలో పెళ్లి ఖర్చు కూడా చాలా ఎక్కువే. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు.. పెళ్లి ఆర్భాటాన్ని మరింతగా పెంచుతున్నాయి.కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా పెళ్లి ఖర్చు భారీగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే సాధారణ స్థాయికి దిగజారిపోయింది.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. జనం మూకుమ్మడిగా గుమిగూడితే కరోనా వైరస్ కాటేసే ప్రమాదం ఉంది. దీంతో పెళ్లిళ్లు, పేరంటాలను, ఇతర ఫంక్షన్లను అంతా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
నిజానికి పెళ్లంటే.. అంతా సందడే. చుట్టాలు, స్నేహితులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు అలాంటి పెళ్లికి అర్ధం మారిపోయింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా వివాహ మహోత్సవం కాస్త .. సాదాసీదా వేడుకలా తయారైంది. అంతే కాదు లక్షల ఖర్చు కూడా ఒక్కసారిగా పడిపోయింది. పెళ్లి వేడుకను అంతా వీడియోలో వీక్షించే రోజులు వచ్చేశాయి. వధూ వరుల కుటుంబ సభ్యుల్లో అతి కొద్ది మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యే పరిస్థితి నెలకొంది.
అలాగే నుదుటన బాసికం స్థానంలో ఏకంగా ముఖానికే ఫేస్ షీల్డ్ వచ్చి చేరింది. దిష్టి చుక్కలు పెట్టాల్సిన బుగ్గలకు మాస్క్ కట్టాల్సిన దుస్థితి వచ్చింది. పెళ్లి.. అంటే వధూ వరులు ఇద్దరూ ఒక్కటయ్యే అపురూప క్షణం. కానీ ఇప్పుడు విస్తరిస్తున్న కరోనా దెబ్బకు వారు కూడా సామాజిక దూరం పాటించాల్సిన దుస్థితి దాపురించింది.
పెళ్లిళ్లు సరిగ్గా ఇప్పుడు ఇలాగే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ యువ జంట ఇలాగే పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల్లో వరుని వైపు నుంచి ఐదుగురు వధువు వైపు నుంచి ఐదుగురు హాజరయ్యారు. ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించారు. శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నారు. పూల దండలకు డిసిన్ఫెక్షన్ స్ప్రే చల్లారు. మూడడుగుల దూరంలో ఉండి బ్రాహ్మణులు పెళ్లి మంత్రాలు పఠించారు.
కరోనా వైరస్ కారణంగా పెళ్లి ఖర్చు బాగా తగ్గిపోయినప్పటికీ.. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య పెళ్లి చేసుకోవడమనే మానసికోల్లాసానికి మాత్రం వధూవరులు దూరమవుతున్నారు. ఇంకా కరోనా వైరస్ ఎన్నెన్ని సిత్రాలు చేస్తుందో.. చూడాలి..! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..