రాజస్థాన్‌లోని అల్వార్‌లో దారుణం జరిగింది. గోవులు అక్రమంగా తరలిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై కొందరు అల్లరిమూకలు దాడి చేశారు. ఈ అల్లరిమూకల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే, హర్యానాకు చెందిన అక్బర్ ఖాన్ అనే వ్యక్తి మరో వ్యక్తి అస్లాంతో కలిసి శుక్రవారం రాత్రి స్వగ్రామం నుంచి ఆవులను తీసుకుని, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రామ్‌గఢ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వారు ఆవులను తీసుకుని నడుచుకుంటూ వెళ్తుండగా, అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో స్థానికులు వారిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో, అక్బర్ ఖాన్ అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తి అస్లాం గాయపడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి.. అక్బర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అల్వార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.
'వాళ్లు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించాము. నిందితులని గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తాం' అని అల్వార్ ఏఎస్పీ అనిల్ బేణీవాల్ తెలిపారు.
It is not clear if they were cow smugglers. The body has been sent for postmortem, We are trying to identify the culprits and arrests will be made soon: Anil Beniwal, ASP Alwar on a man allegedly beaten to death by mob in Alwar's Ramgarh last night on suspicion of cow smuggling pic.twitter.com/qFcMZJfyZP
— ANI (@ANI) July 21, 2018
దేశంలో గోసంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశంలో ఇలాంటి హింసాత్మక సంఘటనలు అరికట్టడానికి పార్లమెంట్ కొత్త చట్టాన్ని చేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పౌరులు చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని వ్యాఖ్యానించింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఈ దాడులపై స్పందించినా... పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు.