నేడు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌తో అమిత్‌ షా భేటీ

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో బుధవారం సాయంత్రం భేటీ కానున్నారు.

Last Updated : Jun 6, 2018, 09:05 AM IST
నేడు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌తో అమిత్‌ షా భేటీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో బుధవారం సాయంత్రం భేటీ కానున్నారు. ముంబైలోని ఉద్దవ్‌ నివాసంలోనే ఈ భేటీ జరగనున్నట్టు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. అమిత్‌ షా కోరిక మేరకే ఈ సమావేశం ఏర్పాటుచేశామని సంజయ్‌ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయనున్నారని మీడియా ప్రశ్నించగా.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని రౌత్‌ వెల్లడించారు.

ఇటీవల జరిగిన పాల్‌గఢ్‌ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ వేర్వేరుగా తలపడిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతన్న శివసేనతో అమిత్‌ షా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తారని.. ఈ భేటీకి ఇటీవల ఉప ఎన్నికలకు సంబంధం లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

2019  సార్వత్రిక ఎన్నికల్లో శివసేన మద్దతు కూడగట్టేందుకు అమిత్‌ షా ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే కాలంలో రెండు పార్టీలు తిరిగి ఏకతాటిపైకి వచ్చే అవకాశం లేకపోలేదని వారు అంటున్నారు.

ప్రముఖులతో భేటీ

అమిత్‌ షా ముంబైలో బుధవారం బిజీబిజీగా గడపనున్నారు. ఆయన ఉద్దవ్‌తో పాటు పలువురు ప్రముఖులతోనూ భేటీ కానున్నారని సమాచారం. రతన్‌ టాటా, లతా మంగేష్కర్‌, మాధురీదీక్షిత్‌లతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం చత్తీస్‌గఢ్‌లో శిరోమణి అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, మిల్కాసింగ్‌లతోనూ సమావేశం కానున్నారు.

Trending News