న్యూఢిల్లీ: 2019 ఎన్నికల కన్నా ముందు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అంశాన్ని నేడు ఎర్రకోటపై ఆయన మరోసారి ప్రస్తావించారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అమలులోకి వచ్చిందని చెబుతూ.. అలాగే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక దేశంలో ఒకే విధానం అమలులో ఉండాలనే ఉద్దేశంతోనే తాము దేశం మొత్తం ఒకే పన్ను విధానం తీసుకువచ్చామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తుచేశారు. వీటన్నింటిని అనంతరం ఇక తర్వాతి వంతు ఒకే దేశం.. ఒకే ఎన్నికదే అంటూ మోదీ పునరుద్ఘాటించడం గమనార్హం. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సమస్యలు సృష్టించడం, ఆ సమస్యలను ఏళ్ల తరబడి పరిష్కరించకుండా నాన్చడం అనేది తమ ప్రభుత్వం లక్ష్యం కాదని చెబుతూ.. ఎన్డిఏ సర్కార్ రెండోసారి అధికారంలోకొచ్చిన అనంతరం 70 రోజుల్లోపే తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మోదీ వివరించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేయడంతోపాటు ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూర్చే త్రిపుల్ తలాక్ బిల్లు వంటివి అందులో కొన్ని అని గుర్తుచేశారు.