అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూరత్ లోని విద్యార్థులు .. ప్రదాని నరేంద్ర మోదీ, డోనాల్డ్ ట్రంప్ చిత్రాలతో కూడిన 3D రంగవల్లిని తీర్చి దిద్దారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మోదీ, ట్రంప్ మధ్యలో 'నమస్తే ట్రంప్' అని రాశారు. అంతే కాదు వారిద్దరి చిత్రాలను అంతర్జాతీయంగా అతి పెద్ద స్టేడియంగా తీర్చిదిద్దిన మొతేరా స్టేడియంలో చిత్రీకరించారు. చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీని కూడా రంగుల్లో తీర్చిదిద్దడం విశేషం.
సూరత్ లోని జీడీ గోయెంకా స్కూలు విద్యార్థులు ఈ 3D రంగవల్లిని తీర్చిదిద్దారు. ప్రపంచానికే గర్వకారణమైన అతి పెద్ద స్టేడియం గుజరాత్ లో నిర్మితం కావడం .. చాలా సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. మోదీ, ట్రంప్ రాక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.