1987లో ఢిల్లీలోని హషింపురలో సంచలనం సృష్టించిన సామూహిక హత్యల కేసులో 16 మంది పీఏసీ(ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరి) అధికారులను నిర్దోషులుగా ప్రకటిస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపారేస్తూ తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 16 మంది అధికారులకు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హై కోర్టు నేడు సంచలన తీర్పు వెల్లడించింది. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో మైనారిటిలు ఎందరో ప్రాణాలు కోల్పోయారని, బాధితుల కుటుంబాలకు న్యాయం జరగడానికి 31 ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈమేరకు తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్ ద్వారా ఈ వార్తను వెల్లడించింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి. 31 ఏళ్ల పోరాటం అనంతరం ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని, దోషులకు శిక్ష పడిందని కోర్టు వెలుపల ఈ తీర్పు కోసం వేచిచూస్తున్న పలువురు బాధితులు అభిప్రాయపడ్డారు.