జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆసుపత్రి ఉద్యోగిపై రోగి బంధువులు చేయి చేసుకున్న ఘటన చోటు చేసుకోగా.. ఆసుపత్రి ఉద్యోగలంతా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వారు ఎమర్జన్సీ విధులకు కూడా హాజరు కాకపోవడంతో 14 మంది రోగులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే ఓ రోగికి నర్సు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె మరణించింది.
దీంతో రోగి బంధువులు నర్సు నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందని భావించి ఆమెపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు సహాయంగా వచ్చిన ఇతర ఆసుపత్రి సిబ్బందిని కూడా దుర్భాషలాడారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అంతా ఏకమై బంద్‌కు పిలుపునిచ్చారు. బయట పేషెంట్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అలాగే లోపల ఉన్న పేషెంట్లకు కూడా సేవలను నిలిపివేశారు.
పేషెంట్లకు సేవలు నిలిపివేశాక.. పలు ఎమర్జెన్సీ కేసులు నమోదయ్యాయి. అయితే సిబ్బంది పట్టించుకోకపోవడంతో 14 మంది రోగులు మరణించారు. ఈ క్రమంలో చాలా మంది పేషెంట్లు ఆసుపత్రి ఖాళీ చేసి వెళ్లిపోయారు. వేరే ఆసుపత్రుల్లో రోగులను చేర్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ స్పందించారు. సిబ్బంది చేసిన పని సరైంది కాదన్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు. ఆదివారం మధ్యాహ్నంకల్లా ఆసుపత్రి సిబ్బంది బంద్‌ను ఉపసంహరించుకున్నారు.