CM KCR Meeting: అందుకే మన దేశం వెనక్కి పోతోందన్న కేసీఆర్

CM KCR meeting with leaders from Solapur in Maharashtra: హైదరాబాద్ : మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక  సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2023, 03:12 AM IST
CM KCR Meeting: అందుకే మన దేశం వెనక్కి పోతోందన్న కేసీఆర్

CM KCR meeting with leaders from Solapur in Maharashtra: సరిహద్దుతో పాటు సారూప్య బంధం ఉన్న మహారాష్ట్ర నుంచే  బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడం తనకెంతో ఆనందంగా ఉన్నదన్నారు. తొమ్మిదేండ్ల అనతి కాలంలో తెలంగాణలో సాధించిన అభివృద్ధి సంక్షేమం భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ ఇదే స్పూర్తితో మహారాష్ట్రను కూడా ప్రగతి పథంలో నడిపించుకుందామని మహారాష్ట్ర ప్రజలకు సిఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతూనే వున్న నేపథ్యంలో శనివారం నాడు సోలాపూర్, నాగపూర్ తదితర ప్రాంతాల నుంచి పలువురు నేతలు ప్రముఖులు తెలంగాణ భవన్ లో అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి అధినేత  సిఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ... " భారత దేశంలో ప్రస్థుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయి. తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ పదవుల కోసం ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు ఆ పార్టీలనుంచి ఈ పార్టీలకు జంపులు చేస్తున్నరు. మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న సంఘటనలను దేశ ప్రజలు గమనిస్తున్నరు " అని అన్నారు.

ఈ దేశం యువతీయువకులదని... ఎంతో భవిష్యత్తు వున్న యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాల్సి ఉంది. పరివర్తన చెందిన భారత దేశంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపిన సిఎం కేసీఆర్, దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత యువత మీదనే ప్రధానంగా ఉన్నదని స్పష్టం చేశారు. నాటి భగత్ సింగ్ అల్లూరి వంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలను  చైతన్యం చేసే దిశగా భాగస్వాములు కావాల్సి ఉంది’ అని పిలుపునిచ్చారు. 

ఇతర దేశాలు ఎట్లా అభివృద్ది చెందుతున్నాయి మనం ఎందుకు ఇంకా వెనకబడే వున్నమనే విషయాన్ని,. దేశ పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరమం ప్రతి వొక్కరిమీదున్నదని సిఎం అన్నారు. తాను చెప్తున్న విషయాలను గర్తుంచుకుని, గ్రామాలకు వెల్లినంక కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి చర్చించుకోవాల్సిన అవసరమున్నదన్నారు. దేశంలో అవసరానికి మించి అందుబాటులో ఉన్న నదీ జలాలు తదితర సహజసంపదను, 75 ఏండ్లు గడిచినా ఈ దేశ పాలకులు ఇంకా సరియైన రీతిలో వినియోగంలోకి ఎందుకు తేలేకపోతున్నారనే విషయాన్ని ఆలోచించాలన్నారు. ప్రపంచంలో మొన్నటి దాకా వెనకబడిన చైనా వంటి దేశాలు నేడు మనం అందుకోలేని స్థాయిలో అభివృద్ధి చెందాయని సోదాహరణలతో వివరించారు. కేంద్ర పాలకులకు దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు సరియైన రీతిలో లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సభ్య దేశాల ముంగిట అంతర్జాతీయ మార్కెట్లో భారత దేశ ఇజ్జతిని కాపాడుకోవాల్సి ఉందన్నారు.

ఇటువంటి అభివృద్ధి నిరోధకులకు ఓట్లు వేసుకుంటూ వారిని ఇంకా గెలిపించుకుంటూ, కనీసం తాగు నీళ్లు సాగు నీళ్లు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఇంకెన్నాఏళ్లు అభివృద్ధికి దూరంగా ఉందామని సిఎం ప్రశ్నించారు. ‘‘ బిఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి గడపముందుకు వచ్చి నిలవడ్డది. తలుపులు తెరిచి ఆహ్వానించండి. బిఆర్ఎస్ పార్టీని ఆదరించండి. కిసాన్ సర్కార్ తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందాం. తెలంగాణలో జరిగినట్టు మహారాష్ట్రలో ప్రగతి ఎందుకు సాధ్యం కాదో చూద్దాం.’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర మీదుగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ సహా యావత్ దేశవ్యాప్తంగా విస్తరిస్తామని సిఎం పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి రావాలని అన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇటీవలే సోలాపూర్ పర్యటించిన తాను తిరిగి త్వరలో రానున్నట్టు అధినేత తెలిపారు. ‘‘ నేను మల్లా సోలాపూర్ వస్తా... వారం రోజుల ముందు మంత్రి హరీశ్ రావును అక్కడికి పంపుత. పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీ తీద్దాం. కనీసం 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించుకుందాం. తెలంగాణలో జరిగిన అన్ని తీర్ల అభివృద్ధిని సోలాపూర్ సహా మహారాష్ట్రలో చేసి చూయించే బాధ్యత నాది. ఇక్కడకు వచ్చిన మీరంతా నా బిడ్డల వంటి వారు. మీ భవిష్యత్తుకు భరోసా బిఆర్ఎస్ పార్టీది, నాది. మీరు బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోండి. మీ జీవితాలను తీర్చి దిద్దే బాధ్యత స్వయంగా నేను తీసుకుంట.’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇస్తాయని.. వ్యవసాయాధారిత భారత దేశంలోని పాలకులు అందుకు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే తమ పార్టీ నినాదంతో దేశంలో వున్న రైతాంగాన్ని రక్షించుకుందామన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ది చేసుకుందామని అధినేత సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. కాగా... ఇవ్వాల పార్టీలో చేరిన వారిలో... తెలంగాణ నుంచి వలసవెల్లి సోలాపూర్ తదితర ప్రాంతాల్లో స్థిరపడి అక్కడి ప్రజల ఆదరణతో ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్న ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ..  " తమకు తెలంగాణ కన్నతల్లి వంటిదయితే, మహారాష్ట్ర పెంచిన తల్లి వంటిది" అని అన్నారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సందర్భంగా అధినేత సిఎం కేసీఆర్ కు స్థానిక గ్రామ దేవత ప్రతిమను బహూకరించారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర సోలాపూర్, నాగపూర్ ల నుండి బిఆర్ఎస్ పార్టీలో దాదాపు మూడు వందల మందికి పైగా బిఆర్ఎస్ అధినేత సమక్షంలో చేరారు. వారిలో.. నగేశ్ వల్యాల్  (సోలాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ లో మూడోసారి కార్పోరేటర్) జుగన్ బాయ్ అంబేవాలే (రెండోసారి కార్పోరేటర్) , సంతోష్ భోంస్లే (కార్పోరేటర్) ,  రాజేశ్వరి చవాన్ (మాజీ కార్పోరేటర్) ,  జయంత్ హోలెపాటిల్ (బిజెపి ఉద్యోగ్ అఘాడీ ప్రెసిడెంట్), సచిన్ సోంటక్కే (బిజెపి మాజీ కార్పోరేటర్), భాస్కర్ మర్గల్ (మాజీ కార్పోరేటర్) , చేతన్ తుమ్మా, గణేష్, అరుణ్, నరేష్, ప్రేమ్, ఓమ్, భాస్కర్, లక్ష్మణ్, నగేష్, నాగరాజ్, గోవర్ధన్, శ్రీనివాస్, శ్యామ్, శంకర్ తుమ్మ, రమేష్, అజయ్, రాజేశ్, రమేష్, అశోక్, ప్రకాష్, రాజారామ్ వంటి నేతలు ఉన్నారు.

నాగ్‌పూర్ డివిజన్ నుంచి రాజు యెర్నె, స్పోర్ట్స్ క్లబ్ మెంబర్ నాగార్జున మేకల, గోపాల్ గోరంటే, ప్రకాష్, రామకృష్ణ ప్రభు, శామ్ భాను, భూషణ్ కుషే, భూషణ్ మధుకర్ రావు, వాసుదేవ్ ముక్తి, మహేంద్ర ఠాకూర్, రంగా రావు, మమతా, బాల సాహెబ్ దామోదర్, రంగా రావు, రూపేష్ కుమార్ గవాయ్, రాజు యేర్నే వంటి అక్కడి స్థానిక నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి తన్నీరు హరీశ్ రావు సమన్వయం చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు  తక్కెల్లపల్లి రవీందర్ రావు, మధుసూధనాచారి, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్లు రవీందర్ సింగ్, సోమా భరత్ కుమార్ పార్టీ నేతలు కల్వకుంట వంశీధర్ రావు, బండి రమేశ్, రాకేశ్ తదితరులున్నారు.

Trending News