ఆఫీస్‌కు వెళ్లే మహిళలు చకచకా పరుగులు తీస్తూ ఇంటిపని అంతా చూసేసుకొని వెళ్తుంటారు. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ! అసలు చిక్కల్లా ఇక్కడే వచ్చిపడింది. ఆఫీసులో కూర్చొని కుర్చీలోంచి లేవటం లేదట మహిళలు..! ఇంట్లో అంతబాగా పనులు చేసుకొని వచ్చి మధ్యాహ్నం భోజనానికి కూడా లేవకుండా అలానే ఎనిమిది, తొమ్మిదిగంటలు కుర్చీలో ఉండిపోతున్నారని కొందరు అంటున్నారు.
ఇలా చేయడంవల్ల మహిళలు శారీరక, మానసిక విశ్రాంతికి దూరమవుతున్నారు. ఫలితంగా ఒత్తిడి, అలసటకు గురవుతున్నారు. దాని ప్రభావం మనం చేసే పనిపైన పడుతుదని వారు చెప్తున్నారు. మరెలా దీనికి పరిష్కారం అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి.
* మీరు రోజు ప్రారంభానికి ముందే భోజన సమయానికి టైం కేటాయించుకోవాలి.
* కుర్చీలో కుర్చొని తినటం కన్నా.. సహోద్యోగులతో కలిసి క్యాంటీన్‌కు వెళ్లి భోజనం చేస్తే మంచిదని చెప్తున్నారు. దీని ద్వారా వారితో సత్సంబంధాలు బలపడతాయని అంటున్నారు.
* ఎంత పని ఉన్నా సరే.. ఒకటి, రెండు గంటలకొకసారి కుర్చీలోంచి లేచి రెండు, మూడు నిమిషాలు నడవడం ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరానికి కాస్త వ్యాయామం ఇచ్చినవారమవుతాము.
* అలానే కుర్చీలో కూర్చున్నప్పుడు వీలును బట్టి కాలి మడమలు అటుఇటు తిప్పడం వంటివి చేయాలి. దీనివల్ల కాలు తిమ్మిరెక్కడం, కాళ్లు పట్టేసుకోవడం వంటివి రావు.
* చేతులను పైకెత్తడం, మెడను అటుఇటు తిప్పడం వంటివి చేయాలి. కూర్చున్నా, నిల్చున్నా వీపు నిటారుగా ఉండేట్లు చూసుకోవాలి.
* మీ ఇల్లు ఆఫీస్‌కి దగ్గరున్నట్టయితే.. కార్లు, బైకులు వాడవద్దు. వీలైతే నడవండి లేదా సైకిల్‌పై వెళ్ళండి. కాళ్లకు పని చెప్పండి. అంతేకాదు కాలుష్యం బారినుండి పర్యావరణాన్ని రక్షించినవారవుతారు.