బాలీవుడ్ పుణ్యమో ఏమో గానీ.. టాలీవుడ్లో ఈ మధ్య బయోపిక్‌ల హవా నడుస్తోంది. బయోపిక్ సినిమాల కోసం ఈ మధ్య నిర్మాతలు బాగానే ఖర్చు చేస్తున్నారు. ఇటీవలే సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' మూవీ బడ్జెట్ దాదాపు 25 కోట్లు. సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లపైనే వసూలు చేసింది.
సావిత్రి తరువాత ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ మూవీ పైనే. దివంగత నటుడు ఎన్.టీ. రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్లో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్. బాలకృష్ణ క్రిష్ డైరెక్షన్లో పనిచేయడం ఇది రెండో సారి (ఇదివరకు బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంలో నటించారు).
ఈ మూవీ బడ్జెట్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అదేమిటంటే బాలకృష్ణ కెరీర్లోనే అతి భారీ బడ్జెట్ చిత్రం- ఈ చిత్రం అని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్ల పైమాటే. ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్లోనే అతి భారీ చిత్రం అంటే ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. 45 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈసారి మాత్రం ‘ఎన్టీఆర్’ చిత్రంను ఏకంగా 50 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. తండ్రి చిత్రం కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని బాలకృష్ణ సొంతంగా నిర్మిస్తున్నాడు.
విద్యాబాలన్ రెమ్యునరేషన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ఈ చిత్రంలో నటించేందుకు ఏకంగా రెండు కోట్ల పారితోషికం తీసుకొంటోందని సమాచారం. ఈమె కేవలం 20 నిమిషాలు మాత్రమే తెరపై కనిపించబోతున్నట్లుగా తెలిసింది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹78.60 కోట్ల షేర్‌ను రాబట్టింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత షేర్ రాబట్టుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. 'ఎన్టీఆర్' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నారని తెలిసింది.
మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 150 కోట్ల బడ్జెట్‌తో చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా 2019లోనే రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ యోచిస్తోంది.