సి.వి.రాజేంద్రన్.. ఈయన ప్రముఖ చిత్ర దర్శకుడు. ఎన్నో సూపర్ హిట్ తమిళ, కన్నడ, మలయాళం చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 1985లో మెగాస్టార్ చిరంజీవి నటించిన "చిరంజీవి" అనే తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేంద్రన్ ఈ రోజు (ఆదివారం) ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
రాజేంద్రన్ మరణంతో దక్షిణ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల చిత్రాలకు రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు సి.వి.శ్రీధర్‌కు రాజేంద్రన్ స్వయానా కజిన్. తన సోదరుడి చిత్రాలకు తొలుత అసిస్టెంటుగా పనిచేసిన రాజేంద్రన్ ఆ తర్వాత తానే స్వయంగా చిత్రాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించారు.
"దిల్ ఏక్ మందిర్" అనే హిందీ చిత్రంతో తొలిసారిగా రాజేంద్రన్ అసిస్టెంటు డైరెక్టరుగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కళ్యాణ్ కుమార్ నటించిన "నెంజామ్ మరప్పతిల్లాయ్" అనే తమిళ చిత్రంతో అసోసియేట్ డైరెక్టరుగా మారారు. ఆర్ ముత్తురామన్ హీరోగా నటించిన అనుభవం పుదుమాయ్, రాజేంద్రన్ దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఆ తర్వాత దుల్హన్, హమ్ నహీ జుకేంగే లాంటి హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. వన్స్‌మోర్, వియత్నాం కాలనీ లాంటి తమిళ సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
"చిరంజీవి" దర్శకుడు.. సివి రాజేంద్రన్ మృతి