సుకుమార్‌తో విభేదాల్లేవు.. అతడితో మరో సినిమా చేస్తా : మహేష్ బాబు

సుకుమార్‌తో సమస్య లేదు.. అతడితో మరో సినిమా చేస్తా : మహేష్ బాబు

Last Updated : May 5, 2019, 04:29 PM IST
సుకుమార్‌తో విభేదాల్లేవు.. అతడితో మరో సినిమా చేస్తా : మహేష్ బాబు

మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ఈ నెల 9న ఆడియెన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన ఆ సినిమా ఆడియో లాంచింగ్ ఫంక్షన్ ఓ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫంక్షన్‌లో మహేష్ బాబు మాట్లాడుతూ.. తనకు గొప్ప చిత్రాలను అందించిన దర్శకులను స్మరించుకునే క్రమంలో పూరి జగన్నాథ్, సుకుమార్ పేర్లు ప్రస్తావించకపోవడాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ షురూ అయ్యాయి. మహేష్ బాబుతో పెద్ద సినిమాలు చేసిన దర్శకులను ఆయన విస్మరించడం ఏంటని కొందరంటే.. సుకుమార్‌కి మహేష్ బాబుకి మధ్య విభేధాలు వచ్చాయని ఇంకొందరు కామెంట్ చేశారు. 

తాజాగా మహర్షి సినిమా విశేషాలు పంచుకుంటూ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేష్ బాబు.. తనని సూపర్ స్టార్‌ని చేసిన పోకిరి సినిమాను డైరెక్ట్ చేసిన పూరి జగన్నాథ్, 1 నేనొక్కడినే వంటి కల్ట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సుకుమార్ వంటి దర్శకుల పేర్లను ప్రస్తావించకపోవడం తప్పేనని అంగీకరించారు. అయితే, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పొరపాటు కాదని, అంతకు ముందు రోజు 16 గంటల ఫ్లైట్ ప్రయాణం చేసిన అలసట ఓ కారణం కాగా... తాను మాట్లాడుతున్నప్పుడే అభిమానులు దాదాపు స్టేజీపైకి దూసుకురావడం వల్ల అందరు దర్శకుల పేర్ల చెప్పలేకపోయానని అన్నారు. 

వంశీ పైడిపల్లితో మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు డైరెక్టర్ సుకుమార్ గతంలో ప్లాన్ చేశారు. అయితే, ఇటీవల కాలంలో అన్నీ సందేశాత్మక చిత్రాలనే చేస్తున్నందున మరోసారి కూడా సందేశాత్మక చిత్రాన్ని చేయకుండా ఈసారి పూర్తి వినోదాత్మక చిత్రాన్ని చేద్దామనే ఉద్దేశంతోనే అనిల్ రావిపూడి సినిమాకు ఓకే చెప్పానని, అయితే, అదే గ్యాప్‌లో సుకుమార్ కూడా మరో సినిమాను పూర్తి చేసుకుని తన వద్దకు వస్తానని అన్నారని మహేష్ బాబు వివరణ ఇచ్చారు. అంతకు మించి సుకుమార్‌కి తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని.. అనిల్ రావిపూడి సినిమా తర్వాత సుకుమార్‌తో మరో సినిమా చేస్తానని మహేష్ బాబు స్పష్టంచేశారు.

Trending News