తమిళ సినిమాల్లో రాజకీయాలను ప్రస్తావించడం, ఆ సినిమాలు రాజకీయంగా దుమారం రేపడం ఇదేం మొదటిసారి కాదు. అలాగే ఆయా సినిమాలపై వివాదం చెలరేగినప్పుడు, ఆ చిత్ర వివాదంపై స్పందిస్తూ అక్కడి సినీ ప్రముఖులు సైతం ప్రకటనలు చేయడం కూడా ఇవాళ కొత్తేం కాదు. ముఖ్యంగా తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి వారు సినిమాల వివాదం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ?తమిళ సినిమా ప్రముఖులు వివాదంలో చిక్కుకున్న ఓ సినిమాకు మద్దతు పలికారా లేక ఆ సినిమా కథాంశాన్ని తప్పుపట్టారా అనేది ఆ చిత్ర వివాదం తర్వాతి పరిణామాలను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. గతంలో తమిళ సినిమా ప్రముఖుల మద్దతుతో సద్దుమణిగిన చిత్ర వివాదాలు కూడా ఉన్నాయి. అయితే, తాజాగా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన సర్కార్ సినిమా సైతం వివాదంలో చిక్కుకుని తమిళనాడు సర్కార్ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటోంది.
ఏఐఏడీఎంకే ప్రభుత్వం పనితీరును తప్పుపట్టినట్టుగా ఉన్న కొన్ని సన్నివేశాలు అక్కడి ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతలను ఇరుకునపడేశాయి. దీంతో ఆయా సన్నివేశాలను తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ పలువురు మంత్రులు, ప్రభుత్వంలోని పెద్దలు, ఏఐఏడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్, కమల్ హాసన్ ఏం నిర్ణయం తీసుకున్నారని, తమిళ సినిమా ప్రభుత్వం పక్షాన నిలుస్తుందా లేక సర్కార్ సినిమాకు మద్దతు ప్రకటిస్తుందా అని యావత్ తమిళ ఆడియెన్స్ వేచిచూస్తున్నారు.
తాజాగా సర్కార్ వివాదంపై స్పందించిన రజినీకాంత్, కమల్ హాసన్... సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన ఓ సినిమాను ప్రభుత్వం తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి అడ్డుకోవడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. సర్కార్ సినిమా పట్ల తమిళనాడు ప్రభత్వం వ్యవహరిస్తున్న తీరును కమల్, రజినీ ఇద్దరూ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఇద్దరు ట్విటర్ ద్వారా తమిళంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.