అన్నయ్య సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి స్పెషల్ గెస్ట్‌గా ఎన్టీఆర్

నా నువ్వే ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్స్

Last Updated : Jun 11, 2018, 04:51 PM IST
అన్నయ్య సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి స్పెషల్ గెస్ట్‌గా ఎన్టీఆర్

ఎంఎల్ఏ మూవీ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన నా నువ్వే సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో అంతకన్నా ముందుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేట్ చేయడానికి మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే నేడు హైదరాబాద్‌లో జరగనున్న నా నువ్వే ప్రీ రిలీజ్ వేడుకకు కల్యాణ్ రామ్ సోదరుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్టుగా హాజరు కాబోతున్నాడు. జై లవ కుశ ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్ ఫంక్షన్స్ తర్వాత ఈ అన్నాదమ్ముళ్లిద్దరూ కలిసి ఒకే సినిమా ఫంక్షన్ వేదికపైకి వచ్చిన సందర్భాలు లేకపోవడంతో ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న నా నువ్వే ప్రీ రిలీజ్ వేడుక ఆ ఇద్దరు హీరోల అభిమానులకు కన్నుల పండుగ అవనుంది. జయేంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించారు. ఈ ఇద్దరు కలిసి జోడీగా నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించగా తమన్నా ఓ రేడియో జాకీ పాత్ర పోషించింది. 

రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాతో డైరెక్టర్ జయేంద్ర మరోసారి ఏడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. 2011లో సిద్ధార్థ్, ప్రియా ఆనంద్ జంటగా తెరకెక్కిన 180 చిత్రమే దర్శకుడిగా జయేంద్ర ఆఖరి చిత్రం. ఆ తర్వాత ఏడేళ్ల గ్యాప్ తీసుకుని జయేంద్ర డైరెక్ట్ చేసిన నా నువ్వే సినిమా హీరోగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న కల్యాణ్ రామ్‌కి, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న దర్శకుడిగా జయేంద్రకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే జూన్ 14 వరకు వేచిచూడాల్సిందే. 

Trending News