ఆయనకు నాకు అభిమానే కాదు.. స్నేహితుడు కూడా: అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రవీందర్ రెడ్డి శనివారం మృతి చెందారు. 

Last Updated : Aug 26, 2018, 07:28 PM IST
ఆయనకు నాకు అభిమానే కాదు.. స్నేహితుడు కూడా: అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రవీందర్ రెడ్డి శనివారం మృతి చెందారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు నాగార్జున చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. చివరి నిముషం వరకూ క్యాన్సర్‌తో పోరాడిన రవీందర్ రెడ్డి మరణవార్త వినగానే నాగార్జున తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా తన అభిమానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నాగ్ పంచుకున్నారు.

"రవీందర్ రెడ్డి నాకు అభిమాని మాత్రమే కాదు. స్నేహితుడు కూడా. ఆయన మా కుటుంబాన్ని ఎప్పుడూ సపోర్టు చేస్తూనే ఉన్నారు. ఆయనది అందరికీ సాయం చేసే గుణం. నిన్ను ఎప్పటికీ మిస్సవుతుంటూనే ఉంటాం..రవీందర్" అని నాగ్ ట్వీట్ చేశారు. ‘గీతాంజలి’ సినిమా కథా చర్చల సమయంలో రవీందర్ రెడ్డి కూడా తన అభిప్రాయాలు తెలిపారట. కథలో తనకు నచ్చని పలు అంశాలు ఉంటే ఆయన దర్శకుడు మణిరత్నంతో చెప్పి మరీ ఆయనను కన్విన్స్ చేశారట.

‘గీతాంజలి’ చిత్రంలో హీరోయిన్ ఓ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంది. కథ ప్రకారం ఆ పాత్ర సినిమా క్లైమాక్స్‌లో చనిపోవాలి. అయితే హీరోయిన్ చనిపోకూడదని మణిరత్నంకు సూచన చేసింది రవీందర్ రెడ్డి  అని అంటుంటారు.. సినిమాను విషాదభరితంగా ముగిస్తే తెలుగు ప్రేక్షకులకు ఆయన నచ్చదని చెప్పడంతో మణిరత్నం కూడా ఒప్పుకున్నారట. ఆ విధంగా అప్పుడప్పుడు తన హీరో సినిమాలకు సంబంధించిన విషయాల్లో కూడా తన సలహాలు, సూచనలు ఇచ్చేవారట రవీందర్ రెడ్డి.

Trending News