వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ బాలలు.. వ్యూహం పండనుందా..?

వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేయనున్న 115 అభ్యర్థులను ప్రకటించిన సంగతి తేలిందే. ప్రకటించిన తరుణం నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఊపు వచ్చింది. సీఎం కేసీఆర్ వ్యూహాలు.. ప్రతిపక్ష పార్టీల ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2023, 05:31 PM IST
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ బాలలు.. వ్యూహం పండనుందా..?

సాధారణంగా మన దేశంలో అయిదేళ్లు ఎవరైనా పరిపాలిస్తే మళ్లీ అధికారం నిలబెట్టుకోవటం చాలా కష్టం. ఓటర్లు చాలా రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల్ని మార్చి మార్చి అధికారం అందిస్తుంటారు. కానీ, 2014లో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇందుకు మినహాయింపుగా కొనసాగుతూ వస్తోంది. కేసీఆర్ కు వరుసగా రెండు సార్లు సీఎం కూర్చీని అప్పగించారు జనం. 2014లో ఉద్యమ ప్రభావం అనుకున్నా 2018లో గులాబీ బాస్ తన వ్యూహాలు, పాలనా దక్షతతో ఓటర్లను మెప్పించగలిగాడు. అందుకే, తెలంగాణ రాష్ట్ర నూతన చరిత్రలో మొదటి దశాబ్దం తనదే అనేలా ఇంత కాలం జైత్ర యాత్ర కొనసాగించగలిగాడు. మరి వాట్ నెక్ట్స్? 2014, 2018 సంవత్సరాల్లోని సీనే... 2023లో కూడా రిపీట్ అవుతుందా..? 

తెలంగాణలో ప్రస్తుతానికి ప్రధాన పార్టీలుగా ఉన్నవి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు. వాటి తరువాత మూడో అతి ప్రధాన పార్టీగా బీజేపీ గత కొన్ని సంవత్సరాల్లో ఎదిగింది. 2018లో కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచీ 2023 కల్లా దుబ్బాక, హుజురాబాద్ లాంటి విజయాలతో కమలం కూడా కీలకంగా మారింది. గ్రేటర్ హైద్రాబాద్ లో మేయర్ పీఠం సాధించలేకపోయినా, మునుగోడులో పోరాడి ఓడినా కాషాయ ధ్వజం బలమైతే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువే ఉంది. అందుకే, కేసీఆర్ కాంగ్రెస్ తో పాటూ బీజేపీని కూడా దృష్టిలో పెట్టుకుని రేసులో జోరుగా ముందుకు దూసుకొచ్చారు. రెండు జాతీయ పార్టీలు ఇంకా ప్రిపరేషన్స్ కూడా మొదలు పెట్టక ముందే 119లో 115 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశారు! 

అయితే, నిజంగా ఈ దూకుడు సీట్లు రాబడుతుందా? టీఆర్ఎస్ నుంచీ బీఆర్ఎస్ అయిన కారు పార్టీదే మళ్లీ అధికారం అనే వారి మాటెలా ఉన్నా... పాత ఎమ్మెల్యేల్నే వెంటబెట్టుకుని బరిలోకి దిగటం కేసీఆర్ కు కొంత వరకూ రిస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్, ఆయన సర్కార్ కు సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉంటుంది. దళిత బంధు, రైతు బంధు లాంటి ప్రగాల్భాలు ఎన్ని పలికినా... జనంలో అసంతృప్తి ఉన్న మాట అయితే నిజం. వారు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు కూడా. కానీ, తెలంగాణ ఓటర్లు సంపూర్ణంగా కాంగ్రెస్ నుగానీ, బీజేపీని గానీ నమ్మలేకపోవటమే సీఎం సారుకి అతి పెద్ద వరం. 
అయినా కూడా కేసీఆర్ కు ఉన్న వ్యక్తిగత ఛరిష్మా వంద మంది పాత ఎమ్మెల్యేల ముఖాల్ని బ్యాలెట్ బాక్సుల వద్ద చెల్లేలా చేయగలదా? స్థానికంగా చాలా మంది బీఆర్ఎస్ నేతల మీద జనంలో అసంతృప్తి ఉంది. అది ఓటింగ్ డే సమయంలో సైలెంట్ గా బయటపడవచ్చు. ఇక కేసీఆర్ దాదాపుగా పాత కాపుల్నే నమ్ముకోవటంతో కాంగ్రెస్, బీజేపీలకు కూడా ఒకింత శ్రమ తగ్గిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వద్దు పొమ్మంటే కాంగ్రెస్, కాషాయ కండువాలు కప్పుకునే జంప్ జిలానీలు... చివరి దాకా గెలుస్తారో, ఓడుతారో చెప్పలేం. ఇప్పుడు ఆ ప్రశ్నే లేదు. సిట్టింగ్ లు అందరూ కారు దిగకుండా లోపలే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ మిగతా వారిపై దృష్టి పెట్టవచ్చు. సమర్థులైన వార్ని రెండు జాతీయ పార్టీలు ఎంచుకోవచ్చు. వారు కేసీఆర్ ఇమేజ్ ను బీట్ చేసి జనం చేత ఓట్లు వేయించుకుంటారా అంటే... ఆలోచించాల్సిన విషయమే! 

Also Read: Mizoram Accident Updates: కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. 17 మంది దుర్మరణం

చివరగా... తొమ్మిదేళ్ల ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... తనలాగే తొమ్మిదేళ్లుగా అధికారం ఆస్వాదించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని వెంటబెట్టుకోవటం... తెలివైన పనైతే కాకపోవచ్చు. ఎందుకంటే, మొత్తంగా ప్రభుత్వానికి ఉండే ప్రజా వ్యతిరేకతతో పాటూ ఇప్పుడు సిట్టింగుల వ్యక్తిగత లోటుపాట్లు కూడా కేసీఆర్ భుజాలపైనే భారంగా మారనున్నాయి. అన్నిట్నీ తట్టుకుని గులాబీ బాస్ మరోసారి ''బాస్ ఈజ్ బ్యాక్'' అన్నట్టుగా ప్రగతి భవన్ కి వస్తాడా? అది కాంగ్రెస్, బీజేపీల ప్రతిఘటనపై ఆధారపడి ఉంటుంది! రెండు జాతీయ పార్టీలు ఎలాగూ చేతులు కలపవు కాబట్టి... కేసీఆర్ కు మనం ఎంత కాదన్నా... ఒకింత ఎడ్జ్ మాత్రం ఉంది! చూడాలి మరి... 

Also Read: IND vs IRE Dream11 Prediction Today: క్లీన్‌స్వీప్‌కు బుమ్రా సేన రెడీ.. డ్రీమ్‌ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News