ప్రముఖ మలయాళ నటుడు కెప్టెన్ రాజు సోమవారం కొచ్చిలో మరణించారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు.
కెప్టెన్ రాజు కొంతకాలం అనారోగ్యంతో ఉన్నారు. పాలరివట్టం సమీపంలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రమీలా, కుమారుడు రవిరాజ్ ఉన్నారు. జులైలో రాజు తన కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికాకు వెళుతుండగా విమానంలో కెప్టెన్ రాజుకి గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించి అక్కడి నుంచి కొచ్చికి తరలించారు. కొంతకాలం ఆయన ఆర్మీలో పనిచేసినందున ఆయనకు 'కెప్టెన్' అనే పేరు వచ్చింది.
దక్షిణాది సినీ రంగంలో కెప్టెన్ రాజు 500 మూవీల్లో విలన్‌గా, క్యారెక్టర్ పాత్రలలో నటించారు. 1981లో 'రక్తం' సినిమాతో తెరంగేట్రం చేశారు. మలయాళంలో 'నాదోడికట్టు', 'ఒరు ఓడక్కన్ వీరగాథ', 'పవమ్ క్రూరన్' వంటి సినిమాల్లో ఆయన ప్రసిద్ధి చెందారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సినిమాలలో నటించారు. 'ఇథ ఒరు స్నేహగాథ', 'మిస్టర్ పవనై 99.99' అనే రెండు సినిమాలు దర్శకత్వం వహించారు.
ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించిన కెప్టెన్ రాజు.. 2017లో వచ్చిన 'మాస్టర్ పీస్' లో చివరి సారిగా కనిపించారు. తెలుగులో 'బలిదానం', 'శత్రువు', 'రౌడీ అల్లుడు', 'కొండపల్లి రాజా', 'జైలర్ గారి అబ్బాయి', 'గాండీవం', 'మొండి మొగుడు పెంకి పెళ్ళాం', 'మాతో పెట్టుకోకు' అనే సినిమాల్లో నటించారు.
కాగా కెప్టెన్ రాజు మృతి పట్ల మలయాళం సినీ పరిశ్రమతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలు సంతాపం ప్రకటించాయి.