ప్రభాస్ ప్రస్తుతం అబుదాబిలో "సాహో" సినిమా షూటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు భారీ యాక్షన్ సన్నివేశాలను సైతం తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రభాస్ పలు విషయాలు పంచుకున్నారు. పూర్తిస్థాయి హాలీవుడ్ సాంకేతికతతో ఆ సినిమాను తీస్తున్నారని తెలిపారు. ఈ సినిమా కోసం తాము ప్రత్యేకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్‌ను తీసుకున్నామని.. ఆయన అన్ని యాక్షన్ సన్నివేశాలను లైవ్‌గా, సహజమైన రీతిలో చిత్రీకరించారని తెలిపారు.
ముఖ్యంగా 37 కార్లతో పాటు ట్రక్కులను ధ్వంసం చేసే సన్నివేశాలు చాలా ఒరిజినల్‌గా వచ్చాయని ఆయన తెలిపారు. కొన్ని నిజమైన కార్లను కూడా ఈ షూటింగ్‌లో ఉపయోగించారని.. ఒక రియల్ ఇంపాక్ట్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో కూడా ఒరిజినల్ ఆటోమొబైల్స్ ఉపయోగించి షాట్లు తీయడం చాలా థ్రిల్ ఫీలింగ్ కలిగించిందని" ప్రభాస్ తెలిపారు.
సాహో సినిమాకి పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న హాలీవుడ్ టెక్నిషియన్ కెన్నీ బేట్స్ డై హార్డ్, ట్రాన్స్‌ఫార్మర్స్, పెరల్ హార్బర్ లాంటి చిత్రాలకు పనిచేశారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న "సాహో" చిత్రంలో ప్రభాస్‌తో పాటు శ్రద్దా కపూర్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, ఇవెలిన్ శర్మ, జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. వై వంశీక్రిష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుజీత్ దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ కూడా నేర్చుకున్నారు.
ప్రభాస్ "సాహో" సిన్మా షూట్‌లో రియల్ స్టంట్స్..37 కార్లు ధ్వంసం