Gargi Movie Review: లేడీ పవర్ స్టార్ 'సాయి పల్లవి' నటించిన 'గార్గి' సినిమా ఎలా ఉందంటే?

Gargi Movie Review in Telugu: సాయి పల్లవి గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయాన్ని సినిమా రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 05:55 PM IST
  • 'గార్గి'గా ప్రేక్షకుల ముందుకు సాయి పల్లవి
  • అన్ని బాషలలో పాజిటివ్ రెస్పాన్స్
  • సాయి పల్లవి నటనకు మంచి రెస్పాన్స్
Gargi Movie Review: లేడీ పవర్ స్టార్ 'సాయి పల్లవి' నటించిన 'గార్గి' సినిమా ఎలా ఉందంటే?

Gargi Movie Review in Telugu: తెలుగులో లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్న సాయి పల్లవి ఇటీవల విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకోగా ఇప్పుడు మరోసారి గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మలయాళ భాషలో రూపొందిన ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో కూడా డబ్బింగ్ చేసి ఏకకాలంలో విడుదల చేశారు. జూలై 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గార్గి సినిమా భారీ ఎత్తున విడుదలైంది. ముందు నుంచి సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా సినిమా ట్రైలర్ విడుదల చేశాక సినిమా మీద ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయాన్ని సినిమా రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

గార్గి కథ ఏమిటంటే?
గార్గి(సాయి పల్లవి) ఒక స్కూల్లో టీచర్గా పని చేస్తూ ఉంటుంది. తాను ప్రేమించిన బాలాజీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఆమె జీవితం తలకిందులు అవుతుంది. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్ఎస్ శివాజీ) ఒక మైనర్ బాలికను రేప్ చేశాడు అనే ఆరోపణల మీద అరెస్టు అవుతాడు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి దూరమవుతాడు. సమాజం నుంచి రేపిస్ట్ కుమార్తె అనే ముద్ర పడుతుంది. అయితే తన తండ్రి అలాంటి పని చేయడు అని బలంగా నమ్మిన గార్గి, తన తండ్రిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. మైనర్ రేప్ కేస్ కావడంతో ఎవరు కేసు వాదించకపోయినా తమకు తెలిసిన లాయర్ దగ్గర జూనియర్ గా పనిచేస్తున్న గిరీశం(కాళీ వెంకట్) కేసు వాదించేందుకు ముందుకు వస్తాడు. ఈ నేపథ్యంలో గార్గి తన తండ్రిని కాపాడుకుందా? చివరికి ఏం జరిగింది? నిజంగా మైనర్ బాలికను బ్రహ్మానందం రేప్ చేశాడా లేక పోలీసుల చేత ఇరికించబడ్డాడా అనేదే సినిమా. 

విశ్లేషణ:
సాయి పల్లవి ఒక సినిమాలో నటిస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమా ప్రేక్షకులు నచ్చే విధంగా ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా గార్గి సినిమా ఆద్యంతం సాగింది. సినిమా ప్రారంభం నుంచి ఎలాంటి అనవసరమైన సీన్లకు, అనవసరమైన సాగతీతకు ప్రయత్నించకుండా దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను నేరుగా చెప్పడంలో సఫలం అయ్యాడు. మైనర్ రేప్ కేసు బ్యాక్ గ్రౌండ్ లో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వచ్చినా ఎవరూ ఊహించని విధంగా సినిమా మొత్తం సాగుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు మైనర్ రేప్ కేసులకు సంబంధించిన సినిమాల్లో ఎక్కడా కూడా బాధితుల స్ట్రగుల్స్ అలాగే నిందితులుగా ఆరోపించబడ్డ వారి ఇళ్లలో పరిస్థితులు వంటి విషయాలను నిశితంగా టచ్ చేసిన సినిమాలు లేవేమో. కానీ గార్గి ఈ ప్రతి అంశాన్ని టచ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా జడ్జ్ అయిన ఒక ట్రాన్స్ జెండర్ తో పలికించిన డైలాగులు, మీడియా మీద సెటైర్లు కూడా ఖచ్చితంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సినిమా ప్రారంభమైనప్పటినుంచి ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా చాలా సింపుల్గా తాను చెప్పాలనుకున్న కథ చెప్పు కెళ్లాడు దర్శకుడు. ఒకరకంగా ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో అనేక కోర్ట్ రూమ్ డ్రామా సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. పాయింట్ చిన్నది అయినా ఒక కమర్షియల్ సినిమాగా మలవడానికి దర్శకుడు సాహసం చేసినట్లే చెప్పొచ్చు. ఎవరు ఊహించని విధంగా సాగే క్లైమాక్స్ తో ఒక సందేశాత్మక సినిమా అని అనిపించక మానదు. మొత్తం మీద తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు కానీ కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే
నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ టీచర్ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. తన తండ్రి మీద పడ్డ మరకను చెరుపుకోవడం కోసం సాయి పల్లవి పడిన తపన ఆమె నటనను మరో లెవెల్ కి తీసుకు వెళ్ళింది. ఈ సినిమాలో గార్గి పాత్రకు సాయి పల్లవిని తప్ప మరొకరిని ఊహించుకోలేము అనే అంతలా ఆమె తన నటన విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఆమె తరువాత ఈ సినిమాలో నటన విషయంలో స్కోప్ తగ్గింది ఆర్ఎస్ శివాజీ పాత్రకు. బ్రహ్మానందం అనే ఒక రేప్ నిందితుడి పాత్రలో నటించిన ఆయన ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా నటించారు. అలాగే నత్తి లాయర్ గా కాళీ వెంకట్ కూడా తనదైన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. వీరిద్దరిని మనం గతంలోని కొన్ని తమిళ సినిమాల్లో చూసి ఉంటాం  ఇక వీరు తప్ప మిగతా వారంతా మనకు కొత్తగానే కనిపిస్తారు. అయితే ఎవరి పరిధి మీద వారు నటించి ఆకట్టుకున్నారు. ఇక సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ సినిమాలో ఒక రిపోర్టర్ పాత్రలో మెరిసింది. తక్కువ సీన్లే అయినా సినిమాని మలుపు తిప్పే పాత్రలో నటించి ఆమె ఆకట్టుకుంది. 

టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన గౌతం రామచంద్రన్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి ప్రయత్నించారు. అయితే సెకండ్ హాఫ్ లోకి వచ్చాక కధ కాస్త నెమ్మదించడంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ మిగతా ఎక్కడా కూడా సినిమాలో వంకలు పెట్టే అవకాశం ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా గోవింద వసంత అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అతిపెద్ద అసెట్.. కొన్ని హాలీవుడ్ సినిమాలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో అదే విధంగా గోవింద వసంత ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కొన్ని చోట్ల ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు కూడా బాగా కుదిరాయి. ఎడిటింగ్ మీద కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఇప్పటికే నిడివి తక్కువ కాబట్టి అలా వదిలేశారేమో. ఇక నిర్మాణ విలువలు సినిమాకి తగిన విధంగా ఉన్నాయి.
 
ఫైనల్ గా 
గార్గి ఒక సందేశాత్మక చిత్రం. తప్పు చేస్తే తన మన భేదం లేకుండా న్యాయానికి సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ మీద రూపొందించారు. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కోసం కాకుండా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే కచ్చితంగా ఈ సినిమా చూడాలి. సాయి పల్లవి అభిమానులకు మాత్రం ఇది ఒకసారి ప్రైజ్ ప్యాకేజీ.

నటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, ఆర్ఎస్ శివాజీ, శరవణన్, ఐశ్వర్యా లక్ష్మీ
దర్శకుడు: గౌతమ్ రామచంద్రన్
సంగీతం: గోవింద్ వసంత
మాటలు - పాటలు (తెలుగు) : రాకేందు మౌళి
నిర్మాతలు: రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్ 

రేటింగ్ : 3/5

Also Read: The Warriorr Review: పోలీస్ ఆఫీసర్గా రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే ?

Also Read: Justice For Koratala Shiva: కొరటాల శివ సెటిల్మెంట్ వ్యవహారం ఏంటి.. అసలు ఏమి జరిగిందంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News