Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. ట్రోలర్‌లకు మంచు విష్ణు కౌంటర్

Manchu Vishnu Ginna Movie Review మంచు విష్ణు పాయల్ రాజ్‌పుత్ సన్నీ లియోన్ కాంబోలో వచ్చిన జిన్నా మూవీ ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. మరి ఈ చిత్రం టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 12:44 PM IST
  • నేడే మంచు విష్ణు జిన్నా
  • రొటీన్ కథ, కథనాలతో వచ్చిన జిన్నా
  • మెస్మరైజ్ చేసిన సన్నీ లియోన్
Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. ట్రోలర్‌లకు మంచు విష్ణు కౌంటర్

Manchu Vishnu Ginna Movie Review : మంచు విష్ణు జిన్నా మూవీ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ వంటి భామలతో మంచు విష్ణు సినిమా చేయడంతో మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ మూవీ ఇప్పుడు జనాల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్ కోసం పరితపిస్తున్న మంచు విష్ణుకు జిన్నా కలిసి వచ్చిందా? ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కథ
జిన్నా కథ అంతా కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రంగంపేట నేపథ్యంలో జరుగుతుంది. గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా (మంచు విష్ణు) ఊర్లో అప్పు చేసి టెంట్ హౌస్ పెడతాడు. అతను టెంట్ హౌస్ వేస్తే.. పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇక అటు అప్పు పెరుగుతూ ఇటు టెంట్ హౌస్ పరిస్థితి ఇలా అవుతుంది. అదే సమయంలో తన చిన్ననాటి ఫ్రెండ్ అంటూ రేణుక (సన్నీ లియోన్) ఊర్లోకి దిగుతుంది. దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. అప్పులు తీరిపోతాయి. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా.. తాను ప్రేమించిన పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్‌పుత్)తో కలిసి వేసిన పథకం ఏంటి? అసలు మాటలు రాని రేణుక చివరకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? ఈ కథలో రూబి డిసౌజా ఎవరు? జిన్నా కోసం వచ్చిన రేణుక ఎవరు? చివరకు జిన్నా తన ప్రేయసి స్వాతిని ఎలా కాపాడుకున్నాడు? అనేది కథ.

నటీనటులు
జిన్నా పాత్రలో మంచు విష్ణు ఎంతో ఈజీగా నటించేశాడు. ఇది వరకు ఇలాంటి కామెడీ యాక్షన్ ఎంటర్టైన్ చిత్రాలెన్నో చేశాడు. దీంతో జిన్నా పాత్ర విష్ణుకి ఎంతో సులభంగా మారింది. అయితే ఈ సారి మాత్రం విష్ణు తన స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. యాక్షన్, కామెడీలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్ రాజ్‌పుత్ తన అందంతో ఆకట్టుకుంది. సన్నీ లియోన్ మాత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. తన నుంచి ఏం ఆశిస్తారో అది ఇవ్వడమే కాకుండా.. అద్భుతమైన పర్ఫామెన్స్ కూడా ఇచ్చింది. కమెడియన్స్‌గా సద్దాం, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర పాత్రలు సినిమా ఆద్యంతం నవ్విస్తాయి. నరేష్, రఘుబాబు, అన్నపూర్ణమ్మ ఇలా అందరూ మెప్పించేశారు.

విశ్లేషణ
జిన్నా కథ ఏ మాత్రం కొత్తగా అనిపించదు. అలా అని స్క్రీన్ ప్లేను కూడా కొత్తగా రాసుకోలేకపోయారు. కథ, కథనాలు ఊహకు తగ్గట్టుగానే సాగుతుంటాయి. ప్రథమార్థం మాత్రం మొత్తం కథ లైటర్ వేలో సాగుతుంటుంది. ఎక్కడా కూడా జెర్క్ ఇచ్చినట్టు అనిపించదు. ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్టుగా పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగుతుంది. ఇంటర్వెల్ సీన్లో ఇచ్చిన ట్విస్ట్‌ను కూడా జనాలు ముందే పసిగట్టేస్తుంటారు. 

జిన్నా సినిమా కొత్తగా అనిపించదు. అలా అని మరీ అంతగా బోర్ కొట్టించదు. ఇది వరకు ఇలాంటి ఫార్మాట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్నీ సినిమాలు కలిపి కొట్టేసినట్టుగా అనిపిస్తాయి. ఇందులో రాకేష్ మాస్టర్ అంటూ చమ్మక్ చంద్ర, మైసూర్ బాబ్జీ పాత్రలో వెన్నెల కిషోర్ సెకండాఫ్‌ను నిలబెట్టేశారు. కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యారు. ఆ ట్రాక్‌ను బాగానే వర్కౌట్ చేయించారు.

సన్నీ లియోన్ మాత్రం నటనలో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె కోసం రాసుకున్న కారెక్టర్, ఆ పాత్రను తీర్చిదిద్దన విధానం ఓకే అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం కూడా లైన్ వదిలేశారు. మరి నిజంగానే సీక్వెల్ తీస్తారా? అన్నది చూడాలి. సెకండాఫ్ ప్రారంభంలోనే ఈ కథ క్లైమాక్స్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చే సరికి మరింత బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే చివర్లో సన్నీ లియోన్ యాక్షన్ సీక్వెన్ బాగానే డిజైన్ చేసుకున్నారు.

ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే గానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ కొట్టిన డైలాగ్, ప్రెసిడెంట్ ఎలెక్షన్ల మీద వేసిన డైలాగ్, మంచు విష్ణు ఇంట్రో సమయంలో సద్దాం చేత చెప్పిన డైలాగ్స్ ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. సాంకేతికంగా జిన్నా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి. జిన్నా స్థాయికి తగ్గట్టుగా సినిమా కోసం ఖర్చు పెట్టారు.

బాటమ్ లైన్ : జిన్నా.. మంచు విష్ణు కంటే సన్నీ లియోన్ మిన్నా

రేటింగ్ : 2.5

గమనిక: ఈ సమీక్ష కేవలం ప్రేక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది మాత్రమే. 
 

Also Read :  Prince Movie Twitter Review : ప్రిన్స్ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ సినిమాపై అలాంటి టాక్

Also Read : Ginna Movie Twitter Review : జిన్నా ట్విట్టర్ రివ్యూ.. ఒక్కడు కూడా బుక్ చేసుకోవడం లేదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News