Kerala Businessman Siddique Murder Case: మలప్పురం: కేరళలోని కొయికోడ్ జిల్లాలో హోటల్ బిజినెస్ చేస్తోన్న వ్యాపారి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. హోటల్ బిజినెస్ మేన్ సిద్దిఖీ దారుణ హత్యకు గురయ్యాడు. అట్టప్పడి ఘాట్ రోడ్డు పక్కనున్న లోయలో రెండు ట్రోలీ బ్యాగుల్లో సిద్ధిఖి శవం లభ్యమైంది. సిద్ధిఖీని దారుణంగా హతమార్చిన హంతకులు.. అతడి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి రెండు ట్రోలీ బ్యాగుల్లో కుక్కి ఘాట్ రోడ్డు పక్కన ఉన్న లోయలో పడేశారు. 58 ఏళ్ల సిద్ధిఖి మే 18 నుంచి కనిపించకుండా పోయాడు. సిద్ధిఖి అదృశ్యంపై అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు మే 26న శుక్రవారం సిద్ధిఖి శవం పోలీసులకు లభ్యమైంది. ఎరనిపాలెంలోని ఒక హోటల్లో మే 18 -19 తేదీల మధ్య సిద్ధిఖి హత్య జరిగి ఉంటుంది అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని సిద్ధిఖీ ఉద్యోగంలోంచి తీసేసినట్టు తెలుస్తోంది.
మలపురం ఎస్పీ ఎస్ సుజిత్ దాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షిబిలి అనే యువకుడు, అతడి గాళ్ ఫ్రెండ్ శర్ఫానానే సిద్ధిఖీని హత్య చేసి, ఆ తరువాత అట్టపడి ఘాట్ రోడ్డు పక్కన ఉన్న లోయల్లో శవాన్ని ట్రోలీ బ్యాగుల్లో కుక్కి పడేసి అక్కడి నుంచి నేరుగా చెన్నైకి పారిపోయినట్టు చెప్పారు. రైల్వే పోలీసుల సహాయంతో షిబిలిని, అతడి ప్రియురాలు శర్ఫానాని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. తమ పోలీసుల బృందం ఇప్పటికే చెన్నైకి చేరుకుందని.. నిందితులు ఇద్దరినీ మలప్పురం తీసుకొస్తున్నట్టు ఎస్పీ సుజిత్ దాస్ తెలిపారు.
సిద్ధిఖిని ఎలా చంపారు అనేది పోస్ట్ మార్టం పూర్తయ్యాకే తెలుస్తుందని... అలాగే సిద్ధిఖి మర్డర్ వెనుకున్న మోటివ్ ఏంటనేది నిందితులను విచారించాకే తెలుస్తుంది అని ఎస్పీ సుజిత్ దాస్ స్పష్టంచేశారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. వారిలో మరొకరు ఈ హత్య కేసులో నిందితులకు సహకరించిన వారిగా సమాచారం అందుతోంది.