RBI Governor Shaktikanta Das About Rs 500 Notes, Rs 1000 Notes: రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆర్బీఐ చేసిన సంచలన ప్రకటన అనేక అనుమానాలకు, ఊహాగానాలకు తావిచ్చింది. ముఖ్యంగా రూ. 500 నోట్లను కూడా మళ్లీ రద్దు చేస్తారా ? గతంలో రద్దు చేసిన రూ. 1000 నోట్లను మళ్లీ తిరిగి ప్రవేశపెడతారా ? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోను ఈ అంశాలపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఈ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రూ 500 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవడం లేదు అని స్పష్టంచేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. అలాగే రూ. 1000 నోట్లను కూడా తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఈ రెండు అంశాలపై దయచేసి ఎలాంటి ఊహాగానాలు వ్యాపింప చేయవద్దని ప్రజలను అభ్యర్థించారు. బై-మంత్లీ మానిటరి పాలసీ మీటింగ్ అనంతరం గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తరువాత జరుగుతున్న అనేర రకాల ప్రచారాలను, ఊహాగానాలను కొట్టిపారేస్తూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ వివరణ ఇచ్చారు. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో ఇప్పటికే 50 శాతం వెనక్కి వచ్చాయని.. అలా వెనక్కి తిరిగి వచ్చిన 2 వేల నోట్ల విలువ మొత్తం రూ.1.82 లక్షల కోట్లు ఉంటుంది అని శక్తికాంత దాస్ స్పష్టంచేశారు.
మార్చి 31, 2023 నాటికి... రూ. 3.62 లక్షల కోట్ల మేర విలువైన 2 వేల రూపాయల నోట్లు చలామణిలో ఉండగా.. ఆర్బీఐ ప్రకటన తరువాత, సుమారు రూ. 1.8 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 కరెన్సీ నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వెనక్కి వచ్చిన రూ. 2,000 నోట్లలో.. 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లు రూపంలో రాగా.. మిగిలినవి మార్పిడి కోసం ఉన్నాయని దాస్ తెలిపారు.
రూ. 2,000 కరెన్సీ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లుగా మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు రోజుకు 10 నోట్ల వరకు మార్పిడి చేసుకోవడానికి పరిమితిని విధించింది. ఒకవేళ డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి పరిమితి లేకుండా 2 వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు.