First Jobs of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?

First Jobs of Famous Billionaires: ఇప్పుడు మనం చూస్తోన్న లక్షల కోట్లకు పడగలెత్తిన బడా బడా బిజినెస్‌మెన్ అందరూ పుట్టుకతోనే బిజినెస్‌మేన్ కాదు. వారిలో చాలామంది ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్న వాళ్లే.. నెల జీతం కోసం నెల అంతా కష్టపడి చమటోడ్చిన వాళ్లే. ఒకటో తారీఖున వచ్చే జీతం కోసం వేచిచూసిన వాళ్లే..

Written by - Pavan | Last Updated : Jul 1, 2023, 11:13 PM IST
First Jobs of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?

First Jobs of Famous Billionaires: ఒకప్పుడు ఒకటో తారీఖు కోసం వేచిచూసి, వచ్చిన డబ్బులతో పాల బిల్లు, కరెంట్ బిల్లు, నీళ్ల బిల్లు, బియ్యం, చక్కర, వగైరా వగైరా వంటింటి సరుకుల కోసం లెక్కలేసుకుంటూ అందరిలా సర్ధుకుపోయిన వాళ్లే ఇప్పుడు వ్యాపార ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఏంటి నమ్మడం లేదా ? ఇంతకీ ఎవరు వాళ్లు అంటారా ? అయితే రండి .. ఎవరు ఎవరు ఏయే ఉద్యోగాలతో వారి జీవితాలు ప్రారంభించారో మీకు చెబుతా.

పెట్రోల్ బంకులో పనిచేసిన ధీరూబాయ్ అంబానీ
ధీరూబాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించడానికి ముందుగా బతుకుదెరువు కోసం అరబ్బు దేశమైన యెమెన్ లో ఒక పెట్రోల్ బంకులో అటెండెంట్ గా పని చేశాడు. అప్పట్లో అతడి నెల జీతం రూ. 300 . అలా కొన్నేళ్లపాటు చిన్నా చితక ఉద్యోగాలు చేసి కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో 1957 లో భారత్ కి తిరిగొచ్చారు. స్వదేశానికి వచ్చి రావడంతోనే సొంత వ్యాపారం పెట్టారు. అది కూడా తాను యెమెన్ లో దగ్గరుండి చూసిన పెట్రోల్ వ్యాపారాన్ని పెట్టి విజయం సాధించారు. ఇవాళ ధీరూబాయ్ అంబానీ మన మధ్య లేనప్పటికీ.. అతడు సృష్టించిన పెద్ద వ్యాపార సామ్రాజ్యం ప్రపంచ వాణిజ్య సంస్థల్లోనే అగ్రస్థానంలో వెలుగొందుంతుండటంతో పాటు అడపాదడపా ఆయన పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడి స్థానాన్ని సైతం సొంతం చేసుకుంటున్నారు. 

అక్కడే రెజ్యూమ్ టైప్ చేసిన రతన్ టాటా 
రతన్ టాటాకు తొలిసారిగా ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పుడు అతడి చేతిలో రెజ్యూమె కూడా లేదట. ఐబీఎం పిలుపు మేరకు అక్కడికి వెళ్లిన రతన్ టాటా.. అక్కడే ఎలక్ట్రానిక్ టైప్ రైటర్‌పై తన బయోడేటా టైప్ చేసి ఇచ్చాడట. అయితే, కారణం ఏంటి అనేది తెలియదు కానీ రతన్ టాటా ఐబీఎంలో ఉద్యోగం చేయలేదు. రతన్ టాటా తొలిసారిగా టాటా స్టీల్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అక్కడ అతడి పని లైమ్ స్టోన్ గనుల్లో బ్లాస్ట్ ఫర్నేస్‌ని పర్యవేక్షించడం. అలాగే టాటా మోటార్స్‌లో కూడా రతన్ టాటా ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఆయన ఒక టెలికం కంపెనీ ఉద్యోగి నిర్వహించే జీటీ హాస్టల్లో ఉండేవారట. 

అప్పడు వంట వాడు.. ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న అమేజాన్‌కి సృష్టికర్త
ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు అమేజాన్. అంత పెద్ద ఆన్‌లైన్ రీటేల్ స్టోర్‌ని పరిచయం చేసిన జెఫ్ బెజోస్ తన జీవితం ఆరంభంలో.. అంటే 1980 లో మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌లో ఫ్రై కుక్‌గా పనిచేశాడు. అప్పుడు అతడి జీతం గంటకు 2 డాలర్లు ఇచ్చే వారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత జెఫ్ బెజోస్ వివిధ క్లయింట్స్‌తో సొంతంగా పనిచేయడం ఆరంభించాడు. వాల్ స్ట్రీట్‌లో బ్యాంకర్స్ ట్రస్ట్ అనే సంస్థలో ఒక కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగం చేశాడు. ఆ తరువాత సొంతంగా కంపెనీని పెట్టి ప్రపంచం గుర్తెరిగిన బిజినెస్‌మేన్ అయ్యాడు.

ఇన్ఫోసిస్ కంటే ముందు ఎన్నో పనులు..
ఇన్ఫోసిస్ సృష్టికర్త ఎన్ ఆర్ నారాయణ మూర్తి తొలుత ఒక రిసెర్చ్ అసోసియేట్‌గా కెరీర్ ప్రారంభించాడు. అలాగే ఐఐఎం అహ్మెదాబాద్‌లో ఫ్యాకల్టీ మెంబర్‌గానూ పనిచేశాడు. ఆ తరువాత చీఫ్ సిస్టమ్స్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత సాఫ్ట్రానిక్స్ అనే నాన్ -  ఆపరేషనల్ కంపెనీని స్థాపించారు. అలాగే పూణెలో పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ సంస్థలో రూ. 10 వేల వేతనానికి ఉద్యోగం చేశాడు. 

న్యూస్ పేపర్ డెలివరి చేసిన ది గ్రేట్ వారెన్ బఫెట్
ప్రపంచం నలుమూలలా ఆర్థిక వ్యవహారాల గురించి తెలిసిన వారికి ఎవరికైనా వారెన్ బఫెట్ పేరు తెలియకుండా ఉండరు. ప్రపంచానికి ఆర్థిక సూత్రాలు, పాఠాలు చెప్పడమే కాదు.. స్టాక్ మార్కెట్లో తొలినాళ్ల నుంచి కూడా ఆయన ఒక బిగ్గెస్ట్ ఇన్వెస్టర్. 92 ఏళ్ల వయస్సులో.. ఇప్పటికీ అమెరికాలోనే ఎన్నో పేరు మోసిన కంపెనీలకు సీఈఓగా ఉన్న వారెన్ బఫెట్.. తన కెరీర్ తొలినాళ్లలో .. అంటే 1944 లో ది వాషింగ్టన్ పోస్ట్ అనే అమెరికా పత్రికకు సంబంధించిన న్యూస్ పేపర్స్ డెలివరి చేసేవాడట. న్యూస్ పేపర్ డెలివరి బాయ్‌గా చేసిన వారెన్ బఫెట్‌కి అప్పట్లో నెలకు 175 డాలర్ల వేతనం లభించేది. అలాంటి వారెన్ బఫెట్ ఇప్పుడు ప్రపంచ కుబెరుల్లో తొలి వరుసలో ఉంటారు. 

మనం సంపాదించుకున్న దాంట్లోనే ముందుగా పొదుపు కోసం కొంత మొత్తాన్ని కేటాయించిన తరువాతే మిగతా దాంట్లోంచి ఖర్చులు పెట్టుకోవాలి అంటారు వారెన్ బఫెట్. కానీ చాలా మంది విషయంలో ఎలా ఉంటుందంటే.. చాలీ చాలని జీతాలతో రోజులు నెట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ నెల ఒకటో తారీఖు రాకముందే వేతనం కోసం ఎన్నో ఖర్చులు ఎదురుచూస్తుంటాయి. ఆ ఖర్చులు అన్నీ పోగా మిగిలిన దాంట్లోంచే సేవింగ్స్ చేసుకునే పరిస్థితి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వారెన్ బఫెట్ సూత్రాన్ని తూచ తప్పకుండా అనుసరించే వాళ్లే ఆయనలా కుబేరులు అవగలరేమో కదా..

Trending News