Citroen C3 Aircross SUV Car: సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారును ఆ కంపెనీ ఇండియాకు పరిచయం చేసింది. ఫ్రాన్స్‌కి చెందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ ఇండియాలో ప్రవేశపెట్టిన నాలుగో కారు ఇది. సీ3 ట్యాగ్‌తో వచ్చిన కార్లలో ఇది మూడోది. గతంలో హ్యాచ్‌బ్యాక్ కారుతో పాటు హ్యాచ్‌బ్యాక్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌కి కూడా సి3 ట్యాగ్ ఉపయోగించారు. ఇక ఇంతకు ముందు వచ్చిన మూడు కార్ల కంటే ఈ కారు మరెన్నో విధాల కేపబిలిటీస్ ఉన్న కారుగా సిట్రోయెన్ చెబుతోంది.
సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారు రాకతో ఇండియాలో ఎస్‌యూవీ కాంపాక్ట్ కార్లలో ఇప్పటివరకు రాజ్యమేలుతోన్న ఇండియన్ ఆటోమేకర్స్‌కి, కొరియన్ ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చని కంపెనీ భావిస్తోంది. ఇంతకు ముందు సిట్రోయెన్ నుంచి వచ్చిన మూడు కార్లకు ఈ కారుకు ఎక్స్‌టీరియర్స్ డిజైన్ పరంగా ఎన్నో తేడాలు ఉన్నాయి. గ్రిల్ డిజైన్ విషయంలోనైనా లేదంటే.. Y ఆకారంలో ఉన్న డీఆర్ఎల్స్, దాని కింది భాగంలో ఉన్న హెడ్ ల్యాంప్స్, ముందు భాగంలో ఉన్న బంపర్‌లో అమర్చిన ఎయిర్ ఇంటేక్స్.. ఇలా ఎన్నో విషయాల్లో సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారు ఎక్స్‌టీరియర్స్‌లో కొత్తదనం చూపించేందుకు సిట్రోయెన్ ప్రయత్నించింది అని ఈ కారును చూస్తే అర్థం అవుతోంది.
200 mm గ్రౌండ్ క్లీయరెన్స్, అలాయ్ వీల్స్, స్క్వేర్ షేపులో ఉన్న టెయిల్ ల్యాంప్స్ వంటి అంశాలు హ్యాచ్‌బ్యాక్ కారు కంటే ఈ కారుని భిన్నంగా ఉండేలా చేస్తున్నాయి. సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారు టాప్ ఎండ్ వేరియంట్‌లో డ్యూయల్ టోన్ పెయింట్‌లో లభించనుంది. 10.2 అంగుళాల టచ్ స్క్రీన్, రెండో వరుసలో ఏసీ వెంట్స్ లాంటి ఎలిమెంట్స్ ఎస్‌యూవీ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటాయని సిట్రోయెన్ ధీమా వ్యక్తంచేస్తోంది. అంతేకాకుండా ఏ మార్గంలోనైనా సరే సునాయసంగా ప్రయాణం సాగిపోయేందుకు వీలుగా మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రూపొందిన సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారు 110 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్వల్ గేర్ బాక్సుతో రూపొందిన ఈ కారు ఇండియాలో కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని సిట్రోయెన్ కంపెనీ భావిస్తోంది. మరీ ముఖ్యంగా హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ వితారా, టొయొటా హైరైడర్, వోక్స్ వాగాన్ టైగాన్, స్కోడా కుషాక్ లాంటి కార్లకు గట్టి పోటీ తప్పదని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 2023 చివర్లో ఇండియాలో సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారు విక్రయాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.