రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడ టీడీపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఎత్తుకుపోతుందో అన్న భయం వైకాపాను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ క్యాంప్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నేపాల్‌కు పంపినట్లు పలువురు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీల స్థానాల్ని ఖరారు చేసుకున్న టీడీపీ, ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే మూడవ సీటు కూడా గెలుచుకోవచ్చు. అందుకే ఆ మూడో ఎంపీ స్థానం టీడీపీకి దక్కకూడదని వైసీపీ తమ ఎమ్మెల్యేలందర్నీ నేపాల్‌కు పంపేసి మరీ కాపాడుకుందని సమాచారం.
ప్రస్తుతానికి టీడీపీ రెండు ఎంపీ స్థానాల్ని గెలుచుకోగలదు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉంటే, ఆ మూడో స్థానాన్ని కూడా టీడీపీ పార్టీ గెలుచుకోగలదు. అందుకే టెన్షన్లో పడ్డ వైకాపా, ప్రత్యేక ఉద్యమం కోసం తమ ఎమ్మెల్యేలు ఢిల్లీలో చేసిన ధర్నా ముగియగానే, అటు నుంచి అటే వాళ్లందరినీ నేపాల్ పంపించేసింది. ప్రస్తుత నామినేషన్ల తుది గడువు మార్చి 12 తేదిన ముగుస్తుంది. అందుకే అప్పటి వరకూ ఎమ్మెల్యేలందరూ నేపాల్‌లోనే ఉండే అవకాశం ఉందని పలు పత్రికలు ప్రకటించాయి. ఒకవేళ టీడీపీ కనుక మూడో అభ్యర్ధిని ప్రకటిస్తే, ఎమ్మెల్యేలు మార్చి 22 వరకూ నేపాల్‌లోనే ఉంటారని కూడా తెలిపాయి. ఈ క్రమంలో సరిగ్గా పోలింగ్ తేదీ రోజున అసెంబ్లీకి చేరుకొని, తమ అభ్యర్ధి వేంరెడ్డి ప్రభాకరరెడ్డిని గెలిపించుకునేలా వైసీపీ ఆలోచిస్తోంది.
నేపాల్‌కు వెళ్ళిన ఎమ్మెల్యే ముస్తఫా షేక్ శనివారం గుంటూరుకు తిరిగి వచ్చారు. ఆయన మాట్లాడుతూ, వైకాపా పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నేపాల్‌కు పంపిందన్న వార్తను ఆయన ఖండించారు. ఎమ్మెల్యేలు నేపాల్‌కు వెళ్లిన మాట వాస్తవమే అని, అయితే పర్యాటకులుగా వెళ్ళారని, రాజకీయాల కోసం కాదని అన్నారు. నేపాల్‌లో పర్యాటక ప్రదేశాలను సందర్శించే సమయంలో, నియోజకవర్గంలో అతిసార వ్యాధి ప్రబలిందని తెలిసిందని.. అందుకే టూర్ ముగించుకొని వచ్చానన్నారు. అయితే, ఎంత మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నేపాల్ వెళ్లారో చెప్పడానికి ఆయన నిరాకరించారు.