YSR Aasara Scheme 3rd Installment: వరుసగా 3వ ఏడాది వైఎస్సార్‌ ఆసరా పథకం.. మహిళల ఖాతాల్లోకి నగదు

YSR Aasara Scheme 3rd Installment: ఏపీలో అక్కాచెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూసేలా చేసి.. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ సర్కారు స్పష్టంచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 08:15 AM IST
YSR Aasara Scheme 3rd Installment: వరుసగా 3వ ఏడాది వైఎస్సార్‌ ఆసరా పథకం.. మహిళల ఖాతాల్లోకి నగదు

YSR Aasara Scheme 3rd Installment: మూడవ విడత కింద రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుండి.. అంటే మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం వైఎస్‌ జగన్‌ నేడు శ్రీకారం చుట్టనున్నారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటివరకు తమ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లకు చేరుకుంది అని ఏపీ సర్కారు ప్రకటించింది. గత ప్రభుత్వం రుణాలు చెల్లించొద్దు.. పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తాం అని 2014 లో హామీ ఇచ్చి ఎగ్గొట్టిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు రూ. 78.94 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు ఊరటనిస్తూ, 4 వాయిదాల్లో అదే అక్కచెల్లెమ్మలకు 2019 ఎన్నికల నాటికి ఎస్‌ఎస్‌బీసీ తుది జాబితా ప్రకారం ఉన్న రూ. 25,571 కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఇప్పటికే 2 విడతల్లో రూ. 12,758 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించామని వైఎస్‌ జగన్‌ సర్కారు స్పష్టంచేసింది.

ఒకవైపు రుణాలు మాఫీ చేస్తానని చేయకపోగా, అక్టోబర్‌ 2016 నుండి సున్నావడ్డీ పథకం సైతం గత ప్రభుత్వం ఎగ్గొట్టి రద్దు చేయడంతో అప్పుల భారం తడిసి మోపెడయింది. సుమారు రూ. 3,036 కోట్ల వడ్డీని అక్కచెల్లెమ్మలే బ్యాంకులకు అపరాధపు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్ధితి ఏర్పడింది. దీంతో పని తీరు విషయంలో ఏ గ్రేడ్‌‌లో ఉన్న స్వయం సహాయక సంఘాలు కూడా సీ, డీ గ్రేడ్‌లలోకి పడిపోయాయి. అంతేకాకుండా ఎన్‌పీఏలు (నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్) 18.36 శాతానికి పెరిగాయి అని ఏపీ సర్కారు గణాంకాలతో సహా వెల్లడించింది.

వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధి పొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) కూడా అప్పట్లో ఉన్న 18.36 శాతం నుండి 0.45 శాతానికి తగ్గాయి. 99.5 శాతం రికవరీతో అక్కాచెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూసాయి. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ సర్కారు స్పష్టంచేసింది.

పథకం ఉద్దేశం
ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకం తీసుకురావడం జరిగిందని ఏపీ ప్రభుత్వం తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం
మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపారం, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది అని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మహిళలు మరొకరిపై ఆధారపడకుండా వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందూస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా, అజియో రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్‌గుడి, జియాన్, నినె, ఆయేకార్ట్, మహేంద్ర అండ్‌ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి బాటలు వేశామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

కార్పొరేట్‌ సంస్ధలు, బ్యాంకులతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటివరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్రవ్యాపారం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ. 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్‌ పాలపై రూ. 5 నుండి రూ. 15 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారని అన్నారు.

మహిళా సాధికారతకు ఏపీ సర్కారు చేపడుతున్న ఇతర పథకాలు
ఈ ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుంచి, కాయ కష్టం చేయలేని ముసలి వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగు పథకాలు అమలుచేయడంతో పాటు, మహిళాభివృద్ది ద్వారానే కుటుంబాభివృద్ది జరుగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తిగా అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, పేదింటి ఆడపిల్లలలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే మనబడి నాడు – నేడు, ఇంగ్లీష్‌ మీడియం, ఇళ్ళ పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో, అన్ని నామినేటెడ్‌ పోస్ట్‌లలో 50 శాతం మహిళలకు కేటాయించడం, వృద్దాప్య ఫించన్, వితంతు పింఛన్లు, మహిళల రక్షణకు దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్ల వంటి ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి : YSRCP MLAs Suspended: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు.. ఆ ఇద్దరు వీళ్లే..!

ఇది కూడా చదవండి : Rain Alert: ఏపీకి మళ్లీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు హెచ్చరిక

ఇది కూడా చదవండి : AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News