Vijayawada Durga Temple Darshanam Timings: దసరా వేడుకలు పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అమ్మ వారి దర్శనం కోసం వచ్చే వయో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. వారికి సౌకర్యంగా ఉండేలా ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు రేపటి మంగళవారం నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు ఉదయం 10:00 గంటలు నుండి 12:00 గంటలు వరకు, సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే విజయవాడలోని మోడల్ గెస్ట్ హౌస్ నుండి ప్రత్యేక బస్సులలో తీసుకుని వెళ్లి అమ్మవారి దర్శనం చేయించి మళ్ళీ వారిని అక్కడికే తీసుకు రావడం జరుగుతుందని అన్నారు.
ఇందుకోసం ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదని.. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి టికెట్స్ కొనాల్సిన అవసరం లేకుండా దర్శన సదుపాయాలు కల్పిస్తున్నట్టు మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. 2వ తేదీ మూలా నక్షత్రం రోజు మినహా మిగిలిన అన్ని రోజులలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని.. వృద్ధులు, దివ్యాంగులైన భక్తులు ఈ ఉచిత సేవను వినియోగించుకోవాల్సిందిగా మంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.