కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని కర్నూలు జిల్లాలో గుడికి భూమిపూజ చేశారు. నంద్యాల పట్టణ శివార్లలోని చెరువుకట్ట సమీపంలో సమతా హిజ్రాల సంఘం అధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబు గుడికి భూమిపూజ చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో హిజ్రాల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ప్రతి నెలా రూ.1500 పింఛన్ అందించేందుకు సీఎం తీసుకున్న నిర్ణయంతో తమలో మానసికస్థైర్యం పెరిగిందని హిజ్రాల సంఘం గౌరవాధ్యక్షుడు విజయ్‌కుమార్ తెలిపారు. పింఛన్‌తో పాటు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసినందుకు కృతజ్ఞతగా ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం 20 సెంట్ల భూమి కూడా సేకరించారు. ఈ గుడిలో చంద్రబాబు వెండి విగ్రహం కోసం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, అభిరుచి మధు ప్రకటించారు. అనంతరం సమతా హిజ్రాల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్, వెండి విగ్రహ దాత అభిరుచి మధును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీవో రాంసుందర్ రెడ్డి, పురపాలక కమిషనర్ పుల్లారెడ్డి, ఎన్ఎండీ ఫిరోజ్, కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.