YSR Nethanna Nestam: ఒక్కో చేనేత కుటుంబం ఖాతాలో రూ. 1.20 లక్షలు జమ

YSR Nethanna Nestam Scheme: నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి అప్పటి చంద్రబాబు నాయుడి పరిపాలనే కారణం అని వైఎస్ జగన్ ఆరోపించారు. నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి.. చివరికి చేనేతలను మోసం చేశారు అని మండిపడ్డారు. 

Written by - Pavan | Last Updated : Jul 22, 2023, 06:41 AM IST
YSR Nethanna Nestam: ఒక్కో చేనేత కుటుంబం ఖాతాలో రూ. 1.20 లక్షలు జమ

YSR Nethanna Nestam Scheme: బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు.. .బ్యాక్‌ బోన్‌ క్లాసులు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల వేళ తాను నేతన్నల కుటుంబాలకు ఏదైతే హామీ ఇచ్చానో.. ఆ హామీ ప్రకారమే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చి సొంత మగ్గం కలిగిన ప్రతీ నేతన్న కుటుంబానికి ప్రతీ సంవత్సరం రూ.24 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ పోతామని చెప్పాను. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ ఐదవ ఏడాది వరుసగా ఐదవసారి నేతన్న నేస్తం పథకం డబ్బులు నేతన్నల కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇవాళ్టితో కలిపి చూస్తే లబ్ధిదారుల ఖాతాల్లో గత ఐదేళ్లలో కలిపి మొత్తం రూ.1.20 లక్షలు జమ చేశాం అని అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వరుసగా ఐదోఏడాది నేతన్న నేస్తం – నేతన్నకు ఆపన్న హస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. రూ.193.64 కోట్ల మొత్తాన్ని బటన్‌ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నల ఖాతాల్లో జమ చేశారు. 

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ ఒక్క పథకం ద్వారానే గత ఐదేళ్లలో రూ.970 కోట్లు జమ చేసి నేతన్నలకు తోడుగా నిలబడ్డాం అని అన్నారు. బీసీల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా జగన్ చెప్పుకొచ్చారు. గతంలో నేతన్నలు ఎలా ఉండేవారో తల్చుకుంటేనే బాధగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వారిని పట్టించుకోవాలి, తోడుగా నిలవాలి అన్న ఆలోచన ఆ ప్రభుత్వానికి ఏరోజూ రాలేదు అని మండిపడ్డారు. 

2014–19 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్నల కుటుంబాలకు కనీసం సహాయం చేయాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వానికి రాలేదన్నారు. ఆ 77 కుటుంబాలకు కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. వారికి అండగా నిలబడ్డమే కాకుండా ఇలాంటివి ఎప్పుడూ జరగకుండా అడుగులు వేశాం. నవరత్నాలను తీసుకునివచ్చాం. ప్రతి పథకం కూడా ప్రతిపేదవాడి చేతిలో పెడుతూ వచ్చాం. ఇందులో భాగంగానే నవరత్నాల్లో భాగంగా నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చి ప్రతీ కుటుంబానికి ఏదో ఒక విధంగా మేలు జరిగేలా కృషి చేయడం జరిగింది అని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి అప్పటి చంద్రబాబు నాయుడి పరిపాలనే కారణం అని వైఎస్ జగన్ ఆరోపించారు. నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారని.. వారికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. మగ్గంషెడ్డు కట్టిస్తామన్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష బ్యాంకు రుణాలిస్తాం అన్నారు. చేనేత కార్మికులుకు రుణమాఫీ చేస్తామన్నారు. రకరకాల హామీలన్నీ ఇచ్చి.. చివరికి చేనేతలను మోసం చేశారు. సంవత్సరానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఐదేళ్లకు కలిపి కనీసం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అలాంటి అధ్వాన్న పరిస్థితుల్లో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు మన కళ్లెదుటనే కనిపించాయి అని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.

Trending News