విభజన హామీలను సాధించుకోవడం కోసం టీడీపీ పోరును ఉధృతి చేసింది. గత రెండు రోజులుగా వరుసపెట్టి వివిధ రాజకీయ నాయకులను టీడీపీ పార్లమెంట్ సభ్యులు కలుస్తున్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చలేదని, విభజన హామీలను సరిగా అమలు చేయడం లేదని వారికి వివరిస్తున్నారు. తమ పార్టీ కేంద్రంతో చేస్తున్న న్యాయపోరాటానికి, వర్షాకాల సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖలను వారికి అందజేస్తున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం రచించిన పుస్తకాన్ని ఒకటి ఇస్తూ.. ఆ నేతలకు ఆంధ్రప్రదేశ్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారు.
కనిమొళితో టీడీపీ ఎంపీలు భేటీ
సోమవారం రాజ్యసభ టీడీపీ ఎంపీలు సి.ఎం.రమేశ్, మురళీ మోహన్, టీజీ వెంకటేశ్‌లు చెన్నైలో డీఎంకే ఎంపీ కనిమొళితో భేటీ అయ్యారు. పార్లమెంటులో వివిధ అంశాలపై టీడీపీ ఎంపీలుమద్దతు కోరారు. ఏపీకి జరిగిన అన్యాయం, విభజన హామీల అమలులో కేంద్రం చేస్తున్న జాప్యం గురించి కనిమొళికి వివరించారు. వచ్చే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీల కోసం తాము పోరాటం చేస్తామని, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు కనిమొళిని కోరారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. విభజన హామీలను నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారని.. వారికి తాము అండగా ఉంటామన్నారు. అన్నాడీఎంకే నేతలను కూడా టీడీపీ ఎంపీలు కలవనున్నారు.
TDP MPs CM Ramesh, TG Venkatesh and Murali Mohan met DMK MP Kanimozhi in #Chennai today and handed over TDP President & Andhra Pradesh CM N.Chandrababu Naidu’s letter seeking cooperation and support for TDP’s fight against the centre for justice to the state. pic.twitter.com/TvMjhPhcHZ
— ANI (@ANI) July 16, 2018
కేకేతో టీడీపీ నేతలు భేటీ
తెలుగుదేశం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ.. టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావును ఆదివారం మధ్యాహ్నం కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదని, ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిందని, ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు వివరించారు. ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడడానికి శివసేన నేతలతో పాటు ఎన్సీపీ నేతలతో భేటీ కానున్నారని వార్తలు వచ్చాయి. అయితే శివసేన మద్దతు కోసం ముంబయి వెళ్లిన పలువురు టీడీపీ ఎంపీల ఆశలు అడియాసలయ్యాయి. శివసేన నేత ఉద్దవ్ థాక్రేని కలవాలని టీడీపీ ఎంపీలు ప్రయత్నించినా.. ఆయన కలవరని సందేశం అందడంతో నిరుత్సాహపడ్డారు.