Chikoti Praveen: ఎన్ ఫోర్స్ మెంట్ దాడులతో వెలుగులోనికి వచ్చిన క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయాలను షేక్ చేస్తోంది. క్యాసినో పిన్ గా భావిస్తున్న చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డిల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయని తెలుస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులతో చీకోటికి సంబంధాలు ఉన్నట్లు ఈడీకి ఆధారాలు లభించాయని అంటున్నారు. సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు చీకోటి ప్రవీణ్. దాదాపు ఆరు గంటల పాటు సాగిన విచారణలో విదేశాల్లో నిర్వహించిన క్యాసినో వ్యవహారంతో పాటు మనీ లాండరింగ్, హవాలా దందా, బ్యాంక్ ఖాతాల్లోని అనుమానాస్పద లావాదేవీలు, ప్రత్యేక విమానాల బుక్సింగ్ వంటి అంశాలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించిందని తెలుస్తోంది.
చీకోటి క్యాసినో వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. టీడీపీ ఏకైక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్రకుమార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. చీకోటి ప్రవీణ్ తో కనకమేడలకు సంబంధాలు ఉన్నాయని.. ఈడీ ఆయనకు నోటీసులు పంపించిందనే వార్తలు వస్తున్నాయి. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా గెలిచిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు బీజేపీలో చేరారు. ఏకంగా రాజ్యసభలో టీడీపీఎల్పీని బీజేపీఎల్పీలో విలీనం చేశారు. అయితే రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేశారనే కేసులు ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లు... ఆ కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీలో చేరారనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన నిర్మా వాషింగ్ పౌడర్ కామెంట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. గతంలో బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీల బాటలోనే వాషింగ్ పౌడర్ నిర్మా ఫార్మూలాను అనుసరిస్తూ.. చీకోటి ప్రవీణ్ ఈడీ కేసు నుంచి బయటపడేందుకు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గోవాతో నేపాల్, శ్రీలంకలో క్యాసినో నిర్వహించిన చీకోటి ప్రవీణ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పేకాట రాయుళ్లను, ఉమెన్ డ్యాన్సర్లను విదేశాలకు తరలించారని తెలుస్తోంది. క్యాసినోలతో పాటు హవాలా దందా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున హవాలా మార్గంలో లావాదేవీలు నడిపారని అంటున్నారు. హవాలాకు సంబంధించి ఈడీ జరుపుతున్న విచారణలో టీడీపీ ఎంపీ కనమేడల వ్యవహారం బయటికి వచ్చిందని అంటున్నారు. క్యాసినో కస్టమర్లను ప్రత్యేక విమానాల ద్వారా విదేశాలకు తీసుకెళ్లేవాడు చీకోటి ప్రవీణ్. ఇందుకోసం విఐపి పాస్ లను వినియోగించేవాడని గుర్తించినట్లు తెలుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పేకటరాయుళ్లు, డ్యాన్సర్లను ఎయిర్ పోర్టు ఫ్రొటోకాల్ అధికారి రోహన్ ద్వారా తరలించేవాడని తెలుస్తోంది. ఇందుకోసం రోహన్ ఎంపీ
కనకమేడల పాస్ ఉపయోగించారని ఈడీ విచారణలో తేలిందంటున్నారు. ప్రవీణ్ పార్ట్ నర్ సంపత్ కూడా ఈడీ విచారిస్తోంది. సంపత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి ఎంపీ కనకమేడల ప్రోటోకాల్ ఆఫీసర్ రోహన్ కు పలు దఫాలుగా మనీ ట్రాన్స్ ఫర్ అయిందని ఈడీ విచారణలో తేలిందని అంటున్నారు. దీంతో క్యాసినో పిన్ చికోటి ప్రవీణ్ కేసులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార కు కు సంబంధం ఉందనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎంపీ కనకమేడల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
చీకోటి ప్రవీణ్ పై సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రవీణ్ నివాసాల్లో ఈడీ సోదాలు జరిగిన వెంటనే టీడీపీ సీరియస్ గా స్పందించింది. చీకోటి క్యాసినో దందాతో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వర్ల ఆరోపణలకు కొడాలి నాని కౌంటరిచ్చారు. క్యాసినో వ్యవహారం వైసీపీని చిక్కుల్లో పడేసిందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా కనకమేడల పేరు తెరపైకి రావడంతో తెలుగుదేశం పార్టీలో సెగలు రేపుతోందని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం కనకమేడలపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తోంది. వైసీపీ వాళ్లు కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని, చికోటితో తమ పార్టీ నేతలకు ఉన్న లింకులు బయటకు రావడంతో ఇష్యూను పక్కదారి పట్టించేందుకు కనకమేడలను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం ఏపీలో అధికార వైసీపీ, టీడీపీలో సెగలు రేపుతుందని తెలుస్తోంది.