ఎన్టీఆర్ కుమార్తె కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఘోషించలేదా? - టీడీపీ నేత

  

Last Updated : Nov 14, 2018, 10:56 AM IST
ఎన్టీఆర్ కుమార్తె కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఘోషించలేదా? - టీడీపీ నేత

బీజేపీపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ విమర్శలు కురిపించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని చెప్పేవారు పలు విషయాలు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి స్వయానా కాంగ్రెస్ మంత్రిగా సేవలందించారని.. అలాగే బీజేపీలో పదవులు పొందారని.. అలాంటప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ ఘోషించలేదా? అని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రయోజనాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యమని.. ఆయనకు రాజకీయాలు ముఖ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీపై చెడు ప్రచారం చేయడమే బీజేపీ నేతలకు అలవాటైపోయిందని.. రాఫెల్ కుంభకోణం లాంటి వాటిపై సమాధానాలు చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు లోపించిందని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయిన సాదినేని యాదినీ శర్మ  గతంలో జనసేన పార్టీపై కూడా విమర్శలు కురిపించారు 

జనసేన నేత కవాతు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్‌‌లో కాదని, చాతనైతే, చేవ ఉంటే రాష్ట్ర సమస్యలు, ప్రజాసమస్యలపై ,కేంద్రం ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఢిల్లీలో పవన్ కళ్యాణ్‌ కవాతు చేయాలని ఆమె తెలిపారు.  అలాగే తిత్లీ తుఫాను బాధితులను కేంద్రం పట్టించకోన్నప్పుడు.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయనప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. 

Trending News