గవర్నర్ గిరిపై టీడీపీ వార్ మొదలైంది..

ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే పోరాడుతూ వచ్చిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా గవర్నర్ వ్యవస్థపైనే గురిపెట్టింది. గవర్నర్ గిరిని రద్దు చేయలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. ఉన్నట్లుండి టీడీపీ ఎందుకు ఇలా విమర్శలు చేస్తోంది.. ఇంతకీ  గవర్నర్ చేసిన తప్పేంటని అనుకుంటున్నారా .. అయితే వివరాల్లోకి వెళ్లండి.. మీకే అర్థమౌతుంది..                               

Last Updated : Apr 26, 2018, 04:22 PM IST
 గవర్నర్ గిరిపై టీడీపీ వార్ మొదలైంది..

మోడీ సర్కార్‌కు గవర్నర్ నరసింహన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని..వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారని తూ.గో పర్యటనలో చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రే విమర్శలకు దిగడంతో పార్టీ శ్రేణులు మరింత దూకుడు పెంచి గవర్నర్ పై విమర్శలు సంధిస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, పి నారాయణ, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు గవర్నర్ పై విమర్శలు చేస్తూ ..ఈ వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్ కేంద్రానికి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ .. మోడీ  సర్కార్ కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

అసంతృప్తి కారణం ఇదే

ప్రత్యేక హోదా విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కోసం తాము తీవ్రంగా పోరాడుతుంటే గవర్నర్ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కేంద్రం తరఫున ఏజెంట్‌లా మాట్లాడుతున్నారనే భావన టీడీపీ వర్గాల్లో ఉంది. ప్రత్యేక హోదా విషయంలో ఇక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితులను కేంద్రానికి వివరించకుండా గవర్నర్ నరసింహన్ రాష్ట్రానికి అన్యాయం  చేస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఇలా గత కొన్ని రోజుల నుంచి గవర్నర్ నరసింహన్ పై టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉంది.

 దీనికి తోడు టీడీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని పార్టీలను ఏకం చేసేందుకు గవర్నర్ నరసింహన్ ప్రయత్నిస్తున్నారని గత కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీని ఇబ్బందులు పెట్టేందుకు మోడీ సర్కార్ పవన్‌ను ఉసిగొల్పిందని..ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ కీలక పాత్ర పోషించారనే ఊహాగానాలు జోరుగా అందుకున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ విజయవాడకు వచ్చారు. చంద్రబాబుతో కలిసి మాట్లాడిన తర్వాత గవర్నర్ పై డైరక్ట్ ఎటాక్ మొదలైంది. ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలంగా ఉంటేనే రాష్ట్ర పురోగతి సాధించగలమని ... మరి ఎందుకు వేడి పెంచుతున్నారని చంద్రబాబును గవర్నర్ నరసింహన్ ప్రశ్నించినట్లు సమాచారం.  రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని గవర్నర్‌కు  ఈ సందర్భంలో చంద్రబాబు కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రే రంగంలోకి దిగి గవర్నర్ నరసింహన్ పై డైరెక్ట్  ఎటాక్ మొదలెట్టారు. దీన్ని అందుకున్న టీడీపీ నేతలు గవర్నర్ పై విమర్శలు చేసే విషయంలో దూకుడుతో వ్యవహరిస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఏపీకి చెందిన బీజేపీ నేతలు టీడీపీ విమర్శలను ఖండిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది

Trending News