AP Bundh:ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్​- పట్టాభి క్షమాపణకు వైసీపీ డిమాండ్​

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బంద్​ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ నేత పట్టాభి.. సీఎంను క్షమాపణ కోరాలని డిమాండ్​ చేస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 03:05 PM IST
  • ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం
  • టీడీపీ నేతల ముందస్తు అరెస్టులు
  • తిరుపతిలో భక్తులకు ఇబ్బంది కలిగించొద్దన్న పోలీసులు
  • పట్టాభి క్షమాణకు వైసీపీ నేతల డిమాండ్​
AP Bundh:ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్​- పట్టాభి క్షమాపణకు వైసీపీ డిమాండ్​

AP Bundh: తమ పార్టీ నాయకులు, కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడిని వ్యతిరేకిస్తూ.. తెలుగు దేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి చేరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం సహా ఇతర జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే పార్టీ కార్యకర్తలు బస్​ డిపోలు, రోడ్లపైకి చేరి నిరసనల్లో పాల్గొన్నారు.డిపోల నుంచి బస్సులను బయటికి వెళ్లనీయకుండా అడ్డుకున్న కార్యకర్తలను అందుపులోకి తీసుకున్నారు పోలీసులు.  

అమరావతి.. మందడంలో టీడీపీ మహిళా కార్యకర్తలు సచివాలయం మార్గంలో రోడ్డుపై బైఠాయించారు. వైఎస్ఆర్​ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు నిరసన వ్యక్తం చేశారు.

Also Read: Aryan Khan Drugs Case: హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్.. తెరపైకి సంచలన నిజాలు

నేతల అరెస్టులు..

బంద్​ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు, కీలక నేతలను అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు చేపట్టారు.

నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పార్టీ కార్యాలయం నుంచి ఆర్​టీసీ బస్​స్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఓవర్ బ్రిడ్జిపై ర్యాలీని అడ్డుకుని టీడీపీ ఇన్‌ఛార్జి సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులోనూ కీలక నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా చింతమనేని తన వాహనంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. పోలీసులు కూడా ఆయన వాహనాన్ని అనుసరిస్తూ వెళ్లారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును గృహనిర్బంధం చేశారు పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్‌ చేశారు. 

భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు..
బంద్​ నేపథ్యంలో తిరుపతిలో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా.. నిరసనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు రవినాయుడు, మునికృష్ణను అరెస్టు చేశారు పోలీసులు.

Also Read: Srikakulam: చెరువులో బోల్తా పడిన స్కూలు బస్సు.. ఒక విద్యార్ధి మృతి, నలుగురికి గాయాలు (వీడియో)

డీజీపీలో మార్పు రావాలి...

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ దాడులు అనైతికమన్నారు. అయితే పార్టీలన్ని మాట్లాడే భాష పట్ల జాగ్రత్తగా వ్వవహరించాలని సూచించారు.

టీడీపీ ఆరోపణలపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్​.. వైసీపీ దాడుల గురించి మాత్రం స్పందించలేదని సోము వీర్రాజు తెలిపారు. ఇలాంటి విషయాల్లో డీజీపీలో మార్పు రావాలన్నారు. 

బంద్​కు కారణలేమిటి?

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.. ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఏపీలో గంజాయి సరఫరాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో ఆనందబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్​ ఈ విషయంపై తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి సహా పోలీస్​ ఉన్నతాధికారులను దూషించడం వివాదాస్పదమైంది.

పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి.. ఫర్నిఛర్ ద్వంసం చేశారు. పట్టాబిరామ్​ ఇంటిపైన కూడా చేసినట్లు తెలిసింది. ఈ దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చారు.

Also Read: Gandhi hospital Fire accident: గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

వైసీపీ నిరసనలు..

అయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళనలు బంద్ చేస్తున్న సమయంలోనే.. వైసీపీ కార్యకర్తలు కూడా పలు చోట్ల తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని టీడీపీ భావిస్తోందని ఎంపీ మార్గాన్ని భరత్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించే స్థాయి పట్టాభికి లేదని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డిని పట్టాభి వెంటనే క్షమాపణ కోరాలని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. పట్టాభి క్షమాపణ చెప్పకుంటే..తాము చేయాల్సింది చేస్తామని హెచ్చరించారు.

కడప అంబేద్కర్‌ కూడలిలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పులివెందులలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News