ఏపీ రాజధాని అమరావతిలో మెగా శిల్పారామం ఏర్పాటు చేయుటకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి, కడప, విశాఖపట్నం, అనంతపురం ప్రాంతాల్లో శిల్పారామాలు నెలకొల్పారు. అయితే వీటన్నింటితో పోల్చుకుంటే పుట్టపర్తి, పులివెందులలో కట్టిన శిల్పారామాలు చాలా తక్కువ ఆదాయాన్ని నమోదు చేస్తుండడం గమనార్హం. పులివెందులలో కట్టిన శిల్పారామం వార్షిక ఆదాయం 23 లక్షల రూపాయలు కాగా.. మెయిన్‌టెనెన్స్‌తో పాటు సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులు కలిపి 24 లక్షల పైమాటే అయ్యిందని తెలుస్తోంది.
అలాగే పుట్టపర్తి శిల్పారామానికి అవుతున్న వార్షిక వ్యయం రూ.10 లక్షలకు పైగా ఉంటే.. రాబడి మాత్రం 2017 సంవత్సరానికి 81 వేల రూపాయలు మాత్రమే. అయితే వీటితో పోల్చుకుంటే తిరుపతి చాలా రెట్లు మెరుగైన పరిస్థితిలో ఉంది. ఆ ప్రాంతంలోని శిల్పారామం రూ. 167 లక్షల వార్షిక ఆదాయం పొందితే.. ఖర్చులు కేవలం రూ.46 లక్షలే అయ్యాయని సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా మెగా శిల్పారామాన్ని కట్టాలని యోచిస్తోంది ప్రభుత్వం.