కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో నేటి నుంచి నుంచి రాష్ట్రీయ సవయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఆరెస్సెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. వీరితో పాటు బీజేపీ అగ్రనేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 250 మంది బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు హాజరుకానున్నారు. ఇప్పటికే వారందరూ మంత్రాలయం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు శుక్రవారం నాటి సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలిసింది. దేశంలో ప్రస్తుత పరిణామాలు, ఆరెస్సెస్ పాత్ర వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా శనివారం రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని, అనంతరం ఆధునీకరణ చేసిన సుజయీంద్ర ఆరోగ్యశాలను ప్రారంభించనున్నారని తెలిసింది. మరోవైపు ఆరెస్సెస్ జాతీయ అధ్యక్షులు మోహన్ భగవత్ శుక్రవారం ఉదయం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.