లోక్‌సభలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బిగ్గరగా నవ్వడం, అందుకు ఆగ్రహం తెచ్చుకున్న ప్రధాని మోడీ.. "అప్పట్లో రామాయణం సీరీయళ్లలో మాత్రమే ఇలాంటి నవ్వులు చూశాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే చూస్తున్నాం" అంటూ ఆమెపై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ చమత్కారానికి బీజేపీ సభ్యులంతా ఘొల్లుమనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. అయితే, లోక్ సభలో చోటుచేసుకున్న ఈ ఘటనపై రేణుకా చౌదరి మాత్రం ఆగ్రహం వ్యక్తంచేశారు.
#WATCH Congress MP Renuka Chowdhury speaks on PM Narendra Modi's comment on her laughter in Rajya Sabha pic.twitter.com/9ZwBdM5Eiq
— ANI (@ANI) February 7, 2018
తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన రేణుకా చౌదరి.. ప్రధాని నరేంద్ర మోడీ ఒక మహిళా సభ్యురాలి పట్ల అలా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. " గతంలో ఆధార్ కార్డుకి వ్యతిరేకంగా మోడీగారే పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోయి బుధవారం నాటి సభలో మాత్రం ఆధార్ కార్డు ఎల్.కే. అధ్వాని హయాంలోనే రూపుదిద్దుకుందన్నట్టుగా మాట్లాడం వింటుంటే నవ్వొచ్చింది. అందుకే మోడీ మాటలు విని నవ్వాను" అని తాను నవ్వడానికి గల కారణాలను వివరించారు. మోడీ ప్రవర్తన చూస్తోంటే, బీజేపీ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకం అని ఇక్కడే అర్థమైపోతోంది అని రేణుకా చౌదరి ప్రధాని మోడీ సర్కార్‌పై విమర్శలు సంధించారు.