Pilli vs Venu: రామచంద్రపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి చెల్లుబోయిన వేణు మధ్య పంచాయితీ ముఖ్యమంత్రి జగన్ వరకూ చేరింది. సీఎం జగన్‌కు చేరకముందు వ్యాపించిన పుకార్లు అధికార పార్టీలో కలకలం రేపాయి. ఓ దశలో పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడనున్నారనే ప్రచారం గట్టిగా సాగింది.
రామచంద్రపురం పంచాయితీ కొలిక్కివచ్చినట్టు కన్పిస్తోంది. తనయుడు సూర్య ప్రకాశ్ రాజకీయ భవితవ్యం కోసం నెలకొన్న పంచాయితీకు మంత్రి వేణు గోపాలకృష్ణతో విబేధాలు తోడయ్యాయి. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యానాలు పరాకాష్ఠకు చేర్చాయి. దాంతో వివిధ రకాల పుకార్లు విస్తృతమయ్యాయి. ఓ దశలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే ప్రచారం సాగింది. జనసేనలో చేరుతారనే వార్తలు కూడా వ్యాపించాయి.
ఈ క్రమంలో ఇవాళ ఉదయం పిల్లి సుభాష్ చంద్రబోస్ తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాల్ని వివరించారు. అనంతరం తిరిగి రామచంద్రపురం చేరుకుని అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. పార్టీ వీడుతున్నానంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు. జనసేన లేదా మరో పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలో కొనసాగుతున్నానని..పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించానన్నారు. పార్టీ నిర్మాణంలో తానొక పిల్లర్ అని కూడా వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ అని, తన చేతులలో నిర్మించానని పిల్లి తెలిపారు. వైఎస్ఆర్ నుంచి జగన్ వరకూ తనకు ఏ లోటూ రానివ్వలేదని, చాలా గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. ఏ విధమైన వినతి పత్రాలు అందించినా నెరవేర్చానన్నారు.
రాజకీయాల్లో అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవచ్చని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నప్పుడు, ఆ కార్యకర్తల్ని మనుషులుగా చూడనప్పుడు బాధ కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో ఈ విషయాలే మాట్లాడానన్నారు. రామచంద్రపురంపై వైఎస్ జగన్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకముందన్నారు. రామచంద్రపురంలో ఎవరిని నిలబెట్టినా అభ్యంతరం లేదని..జగన్ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
Also read: AP Rains Alert: రేపటికి వాయుగుండం, రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook