ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ( Andhra orissa border ) ప్రాంతం, ఛత్తీస్ గఢ్ లలో ఇటీవలి కాలంలో మావోయిస్టు కార్యకలాపాలు ( Maoist movements ) ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో జరిపిన కూంబింగ్ ఆపరేషన్ లో భారీగా మావోయిస్టు డంప్ లభ్యమైంది.
మావోయిస్టుల కదలికలు ఏవోబీ, ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో ఎక్కువయ్యాయి. భద్రతా బలగాల్ని టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ లు కీలకంగా దృష్టి సారించాయి. నిఘాను పటిష్టం చేస్తూనే కూంబింగ్ ఆపరేషన్ ( Combing operation ) విస్తృతం చేశాయి. ఇందులో భాగంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్ లో స్వాభిమాన్ అంచల్‌లోని పేపర్‌మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల భారీ డంప్ ( Maoist dump ) ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల్నించి అందిన సమాచారం మేరకు.. భీమారం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
కూంబింగ్ ఆపరేషన్ సందర్బంగా మావోయిస్టులు, పోలీసులు ఎదురెదురయ్యారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టులు తప్పించుకున్నారు. అనంతరం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పేలుడుకి వినియోగించే ఐఈడీలు, 7.62 మిమీ ఎస్ఎల్ఆర్ లైవ్ రౌండ్లు 11, నాలుగు 7.62 మిమీ ఏకే 47 రౌండ్లు, ఒక 5.56 మిమీ ఇన్సాస్ రౌండ్లు, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, 32 డిటోనేటర్లు, ఒక ఫ్లాష్ కెమెరా, రేడియో, 11 కిట్ బ్యాగులు, మూడు మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యంతో పాటు రోజు వారి అవసరాలకు వినియోగించే వస్తువులు లభ్యమయ్యాయి.
భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఇటీవలి కాలంలో ప్రతీకారదాడులకు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యల్ని తీవ్రం చేశారు. తాజాగా ఇదే అటవీ ప్రాంతంలోని పలుచోట్ల భారీగా ఆయుధాలు, మందుగుండు లభ్యమైంది. Also read: AP: హైదరాబాద్-బెంగుళూరు కారిడార్ కు కేంద్రం పచ్చజెండా