జనసేనాని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో మలి విడత ప్రజాపోరాట యాత్రకు శ్రీకారం చుట్టునున్నారు. ఈ నెల 28వ తేది నుండి ఆ యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పార్టీ పొలిటికల్ కన్వీనర్ మాదాసు గంగాధరం ఓ ప్రకటనలోతెలిపారు. ఈ యాత్రలో పాల్గొనడం కోసమే సోమవారం విశాఖ చేరుకున్నారు పవన్. ఈ క్రమంలో అక్కడి జనసేన నాయకులతో పాటు కొందరు పార్టీ కార్యకర్తలతో పవన్ చర్చలు జరిపారని తెలుస్తోంది.
ఈ సందర్భంగానే ఆయన ఉత్తరాంధ్ర మేధావులతో రేపు సమావేశమవుతున్నారని కూడా సమాచారం. ముఖ్యంగా ఆ సమావేశంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, అందుకు గల కారణాలు, రాజకీయ పురోగతి లాంటి అంశాల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశం గీతం విశ్వవిద్యాలయానికి దగ్గరలో గల సాయి ప్రియ రిసార్ట్స్‌లో జరగనున్నట్లు సమాచారం.
ఈ సమావేశం కుప్పం యూనివర్సిటీ మాజీ ఉపకులపతి కేఎస్ చలం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ జులై 8వ తేది వరకు విశాఖ పర్యటనలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి, చోడవరం,గాజువాక, పెందుర్తి, భీమిలి, ఎస్ కోట ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. విశాఖ పర్యటన తర్వాత జులై 14 తర్వాత పవన్ తదుపరి పర్యటన తూర్పు గోదావరి ప్రాంతంలో ఉంటుంది.