అమరావతి ప్రాంతంలో తన ఇంటి శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు ముఖ్యమైన జనసేన నాయకులతో పాటు తన సతీమణితో విచ్చేసిన పవన్ కళ్యాణ్ అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకొని.. వారికి దగ్గరయ్యేందుకే తాను ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకొనేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు ఆయన.
ఎన్నికల ముందే మీరు ఆస్తులు ప్రకటిస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. తన ఆస్తుల వివరాలు వెల్లడించడానికి భయపడనని.. సమయం వచ్చినప్పుడు వాటి గురించి తప్పక చెబుతానని అన్నారాయన. అలాగే ఉగాది వచ్చేవరకు తాను అమరావతిలోనే ఉండబోతున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్. పార్టీకి సంబంధించిన పనులన్నీ అమరావతి నుండి..తన ఇంటి నుండే మొదలవుతాయని కూడా అన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకొనే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. యువత పార్టీకి ముఖ్యమే అయినప్పటికీ.. సీనియర్ వ్యక్తులు, నాయకులను తాను ఎప్పుడూ తక్కువ చేయనని ఆయన అన్నారు.
అలాగే ఏపీకి మోదీ సర్కార్ అన్యాయం చేసిందని భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఎవరినీ వెనకేసుకు రానని.. ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే మాత్రం తాను బలంగా స్పందిస్తానని పవన్ అన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి తాను అనేక రోజుల నుండి మాట్లాడుతున్నానని ఆయన తెలిపారు.
అలాగే మార్చి 14 తేది తర్వాత తాను అన్ని విషయాలపైనా స్పష్టతను ఇస్తానని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఆవిర్భావ సభలో తాను మనసు విప్పి పంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని కూడా పవన్ అన్నారు. ఆ రోజు వరకు సహనంగా ఉండమని.. ట్రైలర్ కన్నా.. సినిమాయే బాగుంటుందని ఆ నవ్వుతూ చెప్పారు.
తమ పార్టీ ఇప్పటికి 40 వేలమందిని చేర్చుకుందని.. అలాగే ప్రతీ జిల్లా నుంచి కొందరిని పార్టీ ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. 12 మంది మెంబర్లతో స్పీకర్ ప్యానెల్ కూడా పార్టీ ఏర్పాటు చేస్తుందని పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో తెలిపారు. తన తండ్రి సీఎం ఏమీ కాదని.. తనకూ.. మిగతా పార్టీల వారితో పోలిస్తే.. కార్యాచరణ కోసం ఏర్పాట్లు చేసుకోవడంలో వ్యత్యాసం ఉంటుందని.. ప్రజల నమ్మకాన్ని తన సాధించడమే లక్ష్యమని పవన్ చెప్పారు.