జనసేనాని పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని తెలిపారు. తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.. కానీ చంద్రబాబు కొడుకు లోకేష్ ఒక్కరికే మంత్రి జాబ్ దొరికిందని ఆయన ఛలోక్తులు విసిరారు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడే చంద్రబాబు.. ఉత్తరాంధ్రలో నీరు లేక ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నా.. రైతులు అగచాట్లు పడుతున్నా కనీసం స్పందించడం లేదని తెలిపారు.
అలాగే తెలంగాణలో నివాసముంటున్న ఉత్తరాంధ్ర బీసీలకు న్యాయం జరగాలని కూడా పవన్ డిమాండ్ చేశారు. అక్కడ కనీసం వారిని బీసీలుగా కూడా పరిగణించడం లేదని.. చంద్రబాబు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ డిమాండ్ చేశారు. తానే ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్‌తో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు.