పార్లమెంట్ ఉభయ సభలు తెలుగు ఎంపీల నినాదాలతో దద్దరిల్లించింది. ప్రత్యేక ప్యాకేజీపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు నిరసన వ్యక్తం చేయగా.. తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంచాలని కోరుతూ టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేట్టారు. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే మాజీ పార్లమెంట్ సభ్యులు కమలాప్రసాద్‌సింగ్, రుడాల్ఫ్ రోడ్రిగ్స్, ఖాగెన్‌దాస్, కుమారి ఫరీదాల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సభ ప్రారంభంకాగానే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపుపై ఆందోళనకు దిగారు. ఇదే సందర్భంలో వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం అంశంపై చర్చకు సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశాలను కొద్దిసేపు వాయిదా వేశారు.వాయిదా అనంతరం మళ్లీ సమావేశం అయినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన కొనసాగించారు.దీంతో స్పీకర్ లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు.