ఏపీ సీఎంకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. 

Last Updated : Sep 13, 2018, 11:41 PM IST
ఏపీ సీఎంకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడితో పాటు మరో 14 మందిపై ఈ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. ఈ క్రమంలో చంద్రబాబును కోర్టులో హాజరుకావాల్సిందిగా ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు.

అప్పుడే చంద్రబాబుతో పాటు సరిహద్దు దాటి ఆందోళన చేసిన వారిపై కూడా కేసులను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఆ కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇటీవలే మళ్లీ ఎవరో ఈ కేసు నిమిత్తం ధర్మాబాద్ కోర్టులో పిటీషన్ వేయడంతో బాబ్లీ కథ మళ్లీ తెరమీదికొచ్చింది. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ తెరమీదికి రావడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

గోదావరి నదిపై తెలంగాణ సరిహద్దు వద్ద అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం గమనార్హం. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని చెబుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తన నేతలతో కలిసి మహారాష్ట్ర వెళ్లి అక్కడి పనులను అడ్డుకున్నారు. ధర్నాలు చేసారు. వెంటనే అక్కడి ప్రభుత్వం టీడీపీ నేతలను అరెస్టు చేసి సాయంత్రానికల్లా ప్రత్యేక విమానంలో ఏపీకి పంపించింది. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి పొరుగు రాష్ట్రం వెళితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారని, తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. 

Trending News