చంద్రబాబు-భువనేశ్వరిలకు మద్దతుగా కల్యాణ్ రామ్, నారా రోహిత్ రియాక్షన్...

Nandamuri Kalyan Ram and Nara Rohith: ఏపీ అసెంబ్లీలో శుక్రవారం (నవంబర్ 19) చోటు చేసుకున్న పరిణామాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ పెట్టి వెక్కి వెక్కి ఏడవడం టీడీపీ అభిమానులను, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. చంద్రబాబుకు, ఆయన సతీమణి భువనేశ్వరికి మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 04:50 PM IST
  • చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడంతో కలత చెందిన నందమూరి, నారా ఫ్యామిలీలు
    ఒక్కొక్కరుగా స్పందిస్తున్న నందమూరి కుటుంబ సభ్యులు
    హుందాగా నడుచుకోవాలని వైసీపీ నేతలకు కల్యాణ్ రామ్ విజ్ఞప్తి
    ఇక మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదన్న నారా రోహిత్
చంద్రబాబు-భువనేశ్వరిలకు మద్దతుగా కల్యాణ్ రామ్, నారా రోహిత్ రియాక్షన్...

Nandamuri Kalyan Ram and Nara Rohith: తన భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రెస్ మీట్ పెట్టి విలపించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు, భువనేశ్వరిలకు నందమూరి ఫ్యామిలీ అండగా నిలబడుతోంది. ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఈ వ్యవహారంపై స్పందించారు.

'అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలామంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను.' అని కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

 

మరో సినీ హీరో నారా రోహిత్ (Nara Rohith) సైతం ఈ వ్యవహారంపై ట్విట్టర్‌లో స్పందించారు. 'ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా వ్యవహరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని, వారి సతీమణి భువనేశ్వరిని (Nara Bhuvaneshwari) గారిని అసభ్య పదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ కుటుంబ సభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు.  రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రపు హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు గారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది.' అని నారా రోహిత్ పేర్కొన్నారు.

Also Read: ఏపీ అసెంబ్లీ ఘటన నా మనసును కలచి వేసింది: జూ. ఎన్టీఆర్

'శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్లు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతీ ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు. ఈ వికృత క్రీడలను వెనకుండి ఆడిస్తున్నవారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి స్థాయి లేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం (AP Politics) చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం.' అని నారా రోహిత్ చెప్పుకొచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News