ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ), తెలంగాణ ( Telangana ) రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు వర్షాలు తప్పేట్టు లేవు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ( Bay of Bengal ) నుంచి తూర్పు అరేబియా సముద్రం ( Arabia Sea ) వరకు ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ ప్రాంతానికి మధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
3-4 రోజుల్నించి భారీ వర్షాల ( Heavy Rains ) కారణంగా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. పలు ప్రాంతాలు జలమయమై...ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) ను వరద నీరు ముంచెత్తింది. నగరంలోని అత్యధిక ప్రాంతాలు వరద ముప్పులో చిక్కుకుపోయాయి. పలు ఇళ్లు కూలిపోయి..15 మంది వరకూ మృత్యువాత పడ్డారు. రెండు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు, నాలాలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో నదీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతుండటం, అరేబియా సముద్రంలో అక్టోబర్ 19న మరో అల్పపీడనం ( Depression ) ఏర్పడనుండటంతో రెండు రాష్ట్రాల్లోనూ మరో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ( IMD ) తెలిపింది. మహారాష్ట్ర దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయి వరకు కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్రకు సమీపంలోని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. అనంతరం 48 గంటల్లో మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలకు ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా..వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయి.
ఈ కారణాలతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు ( Moderate rains in ap ) కురిసే అవకాశం ఉంది. అదే విధంగా శనివారం నాడు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడవచ్చు. అటు మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది.
ఈ నేపధ్యంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలి వర్షాల కారణంగా తలెత్తిన వరద పరిస్థితుల్నించి తేరుకోకముందే మరోసారి వర్షాలు పొంచి ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. Also read: Telangana Floods: తక్షణ సాయంగా 1,350 కోట్లు అందించండి.. ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ