"ఆంధ్రప్రదేశ్‌కి సహాయం చేయండి" అని ఆంగ్లంలో రాసిన ప్లకార్డు పట్టుకొని పార్లమెంట్ ద్వారం వద్ద హల్చల్ చేశారు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు. అంతకు ముందు ఆయన అదే ప్లకార్డు పట్టుకొని ఛైర్మన్ వెల్‌లోకి వెళ్లారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కేంద్ర బడ్జెట్ పై తనకున్న వ్యతిరేకతను ఈ విధంగా బహిర్గతం చేస్తున్నానని తెలిపారు.
"ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు అరుణ్ జైట్లీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండేవారు. ఇప్పుడు లీడర్ ఆఫ్ ది హూస్గా మారారు. ఆయన హోదా మారినా.. ఆంధ్రప్రదేశ్ తలరాత మారలేదు" అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేక హోదా అవసరమే అన్నారని.. అయితే ఇప్పుడు దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడడం లేదని కేవీపీ అన్నారు.
ప్రస్తుత బడ్జెట్ ఏపీకి మేలు చేస్తుందని మాట్లాడేవారంతా అజ్ఞానంతో మాట్లాడుతున్నారో లేక స్వార్థంతో మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.కేంద్ర వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందని రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుపై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
'ఏమైంది తనకు? పిచ్చి పట్టలేదు కదా? ' అంటూ కేవీపీని ఉద్దేశించి అన్నారు.. శుక్రవారం రాజ్యసభ ప్రారంభయ్యాక కేవీపీ రామచంద్రరావు ప్లకార్డు పట్టుకొని ఛైర్మన్ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆ హఠాత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు.